మెల్‌బోర్న్: వచ్చే ఏడాది (2027) ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన '1 పాయింట్ స్లామ్'ను మళ్లీ నిర్వహించనున్నారు. జనవరి 17 నుంచి 31 వరకు మెల్‌బోర్న్ పార్క్‌లో జరిగే ప్రధాన డ్రాకు ముందు ఈ పోటీలు జరగనున్నాయి. విజేతకు మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 6.70 కోట్లు) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. గత జనవరిలో జరిగిన టోర్నీలో స్థానిక అమెచ్యూర్ ఆటగాడు జోర్డాన్ స్మిత్.. ప్రసిద్ధ టెన్నిస్ స్టార్ జానిక్ సినర్‌ను ఓడించి మిలియనీర్‌గా నిలిచాడు.
మెన్స్, విమెన్స్, ప్రొఫెషనల్స్, అమెచ్యూర్స్ అందరికీ ఒకే నాకౌట్ బ్రాకెట్‌లో ఒక్కో పాయింట్‌తో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. కార్లోస్ అల్కరాజ్, ఇగా స్వైటెక్, కోకో గాఫ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి రాడ్ లేవర్ అరీనాలో అడుగుపెట్టి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో తలపడటం నా జీవితాన్ని మార్చివేసింది’ అని గత విజేత- జోర్డాన్ స్మిత్ పేర్కొన్నాడు. మెల్‌బోర్న్ పార్క్ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న క్లబ్‌లు, కోచ్‌లు, భాగస్వామ్య పాఠశాలలు క్వాలిఫైయింగ్ ఈవెంట్లను నిర్వహించనున్నాయి.
