న్యూఢిల్లీ: తన కెరీర్‌లో గత పది నెలలు చాలా క్లిష్టంగా సాగాయని, ఓ దశలో గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నానని ఇండియా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. ‘గాయాల నుంచి కోలుకోవడం, శరీరాన్ని తిరిగి దృఢపరుచుకోవడానికే ఎక్కువ సమయం పట్టింది.
పోటీ పడాలని తీవ్రంగా కోరుకుంటున్న సమయంలో లయను తిరిగి పొందడం, ఓపిక పట్టడం నేర్చుకున్నా. ఈ ఏడాది పోటీ పడే అవకాశం ఉంటుందో లేదో తెలియకపోయినా ప్రతి రోజు శిక్షణ కొనసాగించా. మొత్తానికి గత 10 నెలలు నేను ఊహించని రీతిలో నా సహనానికి పరీక్ష పెట్టాయి’ అని నీరజ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. గ్లాస్గో గేమ్స్‌లో గాలి పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ సహాయక సిబ్బంది అందించిన ప్రోత్సాహంతోనే తాను తిరిగి పుంజుకున్నానని వెల్లడించాడు. ‘ఈ స్థాయిలో మళ్లీ పోటీ పడటం చాలా సంతోషంగా ఉంది. నా సొంత ప్రయత్నంతో మాత్రమే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. నాపై నమ్మకం ఉంచిన వారందరికీ నేను ఎంతో కృతజ్ఞుడను’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.
