పెరిగిన వానాకాలం సాగు విస్తీర్ణం.. గతేడాదితో పోల్చితే 10 శాతం పెరుగుదల

పెరిగిన వానాకాలం సాగు విస్తీర్ణం.. గతేడాదితో పోల్చితే 10 శాతం పెరుగుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది వానకాలం పంటల సాగు గతేడాదితో పోలిస్తే పెరిగిందని ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ అగ్రికల్చర్ వర్సిటీ వెల్లడించింది. ఎల్‌‌నినో ప్రభావం నుంచి రైతులకు కొంత ఉపశమనం లభించడంతో పాటు అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపింది.

యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రిమోట్ సెన్సింగ్, జీఐఎస్‌‌ సాంకేతికత ద్వారా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి సిద్ధం చేసిన తాజా పంటల విస్తీర్ణ నివేదికను వర్సిటీ వైస్ చాన్స్‌‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య బుధవారం విడుదల చేశారు. 2026 జులై 29 నాటికి రాష్ట్రంలో సాధారణ వానాకాల పంటల సాగు లక్ష్యం 98.13 లక్షల ఎకరాలని, ఇప్పటికే 33 లక్షల ఎకరాల్లో (సుమారు 34 శాతం) వివిధ పంటల విత్తనాలు వేశారని తెలిపారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం అధికం అని ఆయన తెలిపారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో 57 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 54%, జనగామ జిల్లాలో 51% విస్తీర్ణంలో విత్తనాలు వేసి, మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. మరోవైపు, ఖమ్మం జిల్లాలో 16.5 శాతం, వనపర్తి జిల్లాలో 17.3 శాతం, వరంగల్ జిల్లాలో 20.1 శాతం మాత్రమే సాగు నమోదై, చివరి స్థానాల్లో ఉన్నాయని తెలిపారు.

పంటల వారీగా చూస్తే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వరి, పత్తి, మొక్కజొన్న పంటలే పెద్ద మొత్తంలో సాగు చేశారని వెల్లడించారు. అయితే పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం నిరుడితో పోలిస్తే పెరిగినట్లు నివేదికలో వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన పంటల మార్పిడి అవగాహన కార్యక్రమాల ఫలితంగానే ఈ పెరుగుదల నమోదైందని జానయ్య తెలిపారు.