- మంత్రి ఉత్తమ్
- ముందు కాళేశ్వరంలో ముడుపులు అందాయన్న కవిత ఆరోపణలకు జవాబు చెప్పాలి
- బీఆర్ఎస్ హయాంలోనే రాయలసీమ ప్రాజెక్టుకు అడుగులు పడలేదా?
- పోలవరం- బనకచర్ల ప్రాజెక్టునూ అప్పుడే తెరపైకి తేలేదా? అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: బోర్డు మీటింగుల్లో12 ఏండ్లుగా ఏపీ ప్రతిసారీ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూనే ఉన్నదని, అదేమీ కొత్త విషయం కాదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతిచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలు.. ఇప్పుడు అధికారం కోల్పోగానే కడుపుమంటతో బట్టకాల్చి మీదవేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ బుధవారం కౌంటర్ ఇచ్చారు. గోదావరి బోర్డు మీటింగ్ ఎజెండా అంశాలపై హరీశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానిని మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందాయన్న కవిత ఆరోపణలకు హరీశ్ ముందుగా జవాబు చెప్పాలన్నారు.
ఆ ముడుపుల్లో ఎంత ముట్టాయని ప్రశ్నించారు. ‘‘రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరాన్ని నిండా ముంచి మళ్లీ సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తారా?’’ అంటూ మండిపడ్డారు. తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడూ కాపాడలేదన్నారు. ‘‘బీఆర్ఎస్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగింది వాస్తవం కాదా? పోలవరం–- బనకచర్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయింది ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాదా? పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా ఏపీ పూర్తి చేసింది’’ అని మండిపడ్డారు. సీతారామ సహా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రతిసారీ ఏపీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నదని గుర్తుచేశారు. ఆ ఆరోపణలను తోసిపుచ్చి.. సీతమ్మసాగర్ సీతారామ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు నిరుడు ఏప్రిల్‌లోనే తమ ప్రభుత్వం టీఏసీ అనుమతులు
సాధించిందన్నారు.
రాష్ట్ర జలహక్కులను మేమే కాపాడినం..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, సీతారామ, సమ్మక్కసాగర్, చిన్నకాళేశ్వరం, మోడికుంటవాగు, గూడెం లిఫ్ట్ వంటి 7 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి బోర్డులకు ఏపీ ఫిర్యాదు చేసిందని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. టీఏసీ క్లియరెన్సులు వచ్చిన ప్రాజెక్టుల అనుమతులనూ రివ్యూ చేయాలని ప్రతి మీటింగ్‌లోనూ ప్రస్తావించిందని చెప్పారు.
ఏపీ అభ్యంతరాలన్నింటికీ దీటుగా జవాబిచ్చి.. నీటి హక్కులను కాపాడడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. రాష్ట్ర జలహక్కులపై ఎలాంటి ఉదాసీనతకూ తావులేదన్నారు. వాస్తవానికి గోదావరి బోర్డు 3వ మీటింగ్‌లో.. గోదావరి జలాలపైనా ట్రిబ్యునల్ కావాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేదా? అని ప్రశ్నించారు. 2020 అక్టోబర్‌లో నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ బీఆర్ఎస్ ఇదే అంశాన్ని కేంద్రానికి సూచించిందన్నారు. తాము సమ్మక్కసాగర్ విషయంలోనూ చత్తీస్‌గఢ్ నుంచి ఎన్వోసీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. గత ప్రభుత్వం మాత్రం ఎలాంటి సంప్రదింపులూ జరపలేదన్నారు.
ఏడుసార్లు కేంద్రానికి లేఖ రాశా..
తమ ప్రభుత్వం ఇప్పటికే చత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపిందన్నారు. ఆ రాష్ట్ర సీఎంతోనూ భేటీ అయ్యామన్నారు. ఏపీ తలపెట్టిన పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుపైనా వెంటనే స్పందించామన్నారు. తానే స్వయంగా ఏడుసార్లు కేంద్రానికి లేఖలు రాశానని ఉత్తమ్ గుర్తు చేశారు. ఇరిగేషన్ సెక్రటరీ10 సార్లు, ఈఎన్‌సీ19 సార్లు.. వివిధ స్థాయిల్లో అధికారులు కూడా ఆ ప్రాజెక్టును కట్టకుండా ఏపీని అడ్డుకోవాలంటూ లేఖలు రాశారని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా ఏపీ 200 టీఎంసీలను తరలించే కుట్ర చేస్తుంటే.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితం అయిందన్నారు.
