- హైదరాబాద్ బ్రిక్స్ సదస్సులో డీవోపీటీ కార్యదర్శి రచన షా వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బ్రిక్స్ ద్వితీయ అవినీతి నిరోధక కార్యబృందం, ఆస్తుల పునరుద్ధరణ నిపుణుల నెట్‌వర్క్ రెండు రోజుల సమావేశాలు బుధవారం హైదరాబాద్‌లో ముగిశాయి. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాల్లో అవినీతి నిరోధం, సరిహద్దు ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముగింపు సమావేశంలో డీవోపీటీ కార్యదర్శి రచన షా మాట్లాడుతూ.. అవినీతిపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని, డిజిటల్ సాంకేతికతతో పారదర్శక పాలనను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
కాగా, దేశాలు దాటి పారిపోయే ఆర్థిక నేర స్తులను గుర్తించడం, అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, దర్యాప్తు వేగవంతం చేసేందుకు ‘బ్రిక్స్ సమాచార రిపాజిటరీ’ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదనకు సభ్య దేశాలు అంగీకరించాయి. అలాగే ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్ ద్వారా అవినీతి వ్యవహారాలను ముందుగానే గుర్తించడం, క్రిప్టో, ఫిన్‌టెక్ వేదికల దుర్వినియోగంతో జరిగే మనీలాండరింగ్‌పై ఉమ్మడి నిఘా బలోపేతం చేయాలని నిర్ణయించాయి. చట్ట అమలు సంస్థల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం పెంచేందుకు ప్రత్యేక నిపుణుల డైరెక్టరీ ఏర్పాటు చేయడానికీ ఆమోదం తెలిపాయి.
