హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టిన మెట్రో రెండో దశ పనులపై దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. వారసత్వ కట్టడాలకు ప్రతికూలంగా ఉన్న ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన నాలుగో కారిడార్ నిర్మాణంలో భాగంగా మెట్రో రెండో దశ విస్తరణ పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు మహమ్మద్ రహీంఖాన్‌తోపాటు మరొకరు పిటిషన్‌లు దాఖలు చేశారు.
వీటిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ..ఆలయాలు, మసీదులు, చిల్లాలు, దర్గాలు, సమాధులు సహా మొత్తం 102 నిర్మాణాలు మెట్రో లైన్ కింద ఉన్నాయని, ఎక్కడా రైల్వే ట్రాక్ నిర్మాణాలను తాకడం లేదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రామారావు వాదిస్తూ..ప్రభుత్వం కోర్టును తప్పుదోవపట్టిస్తోందని తెలిపారు. పనులకు సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరారు.
