హైదరాబాద్ సిటీ, వెలుగు: మౌలాలి ఆర్‌ఓబీ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.8.50 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఎంఏయూడీ బుధవారం జీవో జారీ చేసింది. పనుల కోసం ఎంఎంసీ సాధారణ నిధులను ఖర్చు చేయనున్నారు.
ఆర్‌ఓబీలో ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్య ఖాళీలు ఏర్పడటం, రోడ్డుపై ఉక్కు భాగాలు బయటపడటం, పలుచోట్ల గుంతలు, పగుళ్లు కనిపించడం వల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రద్దీ వేళల్లో బ్రిడ్జికి రెండువైపులా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రిపేర్లు, పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
