సిద్దిపేట /నల్గొండ/యాదాద్రి, వెలుగు : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం-2026’ కు సిద్దిపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన పలువురు నిపుణులైన చేనేత కార్మికులు ఎంపికయ్యారు. ఈనెల 7న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఎంపికైన ప్రతి ఒక్కరికీ రూ. 25 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రంతో పాటు ఘనంగా సన్మానం చేయనున్నారు.
సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట చేనేత సహకార సంఘంలో పనిచేస్తున్న వల్లకాటి అశ్విని, ఇర్కొడు సహకార సంఘానికి చెందిన వల్లకాటి హన్మంతు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అశ్విని పట్టు చీరపై రామప్ప స్థూపం, నంది బూట్ డిజైన్లను రూపొందించడంలో ప్రావీణ్యం సాధించగా, హన్మంతు గత ఇరవై ఏండ్లుగా మెర్సిడెజ్ కాటన్‌తో గ్రామీణ థీమ్‌లో గొల్లబామ చీరలను నేస్తూ విశేష అనుభవం గడించారు.
నల్గొండ జిల్లాలో పోచంపల్లి ఇక్కత్ చీరల విభాగం నుంచి ఎనిమిది మంది పురస్కారాలకు ఎంపికయ్యారు. వారిలో చేపురి ధనుంజయ(పుట్టపాక), నరహరి కొంగరి(పుట్టపాక), వర్యాల యాదయ్య(పుట్టపాక), చిట్టిపోలు నర్సింహా(చండూర్), వర్యాల సత్యనారాయణ(చండూర్), చిలుకూరి శ్రీనివాసులు(చండూర్),కర్నాటి బొర్రయ్య(చండూర్), వాలుగొండ దశరథ(నల్లగొండ) ఉన్నారు.
యాదాద్రి జిల్లా నుంచి డిజైనర్ విభాగంలో సీత సుధాకర్, కర్నాటి పారిజాత, వీవర్ విభాగంలో గుర్రం బాలరాజు, గుండు చంద్రకళ, ఎదునూరి లక్ష్మయ్య, సంగిశెట్టి పద్మ, రెబ్బ యాదగిరి ఈ అవార్డులను దక్కించుకున్నారు.
