గ్యాస్ లీక్ తో ముగ్గురు మృతి..ఇద్దరి పరిస్థితి విషమం..కర్నాటకలోని సీల్ ల్యాబోరేటరీస్ కంపెనీలో ఘోర ప్రమాదం

గ్యాస్  లీక్ తో ముగ్గురు మృతి..ఇద్దరి పరిస్థితి విషమం..కర్నాటకలోని సీల్ ల్యాబోరేటరీస్  కంపెనీలో ఘోర ప్రమాదం

మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లా కృష్ణ మండల సరిహద్దులోని కర్నాటక రాష్ట్రం కాడేచూర్​ ఇండస్ట్రియల్  ఏరియాలో గ్యాస్  లీక్  కావడంతో ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర సరిహద్దులోని సీల్  ల్యాబోరేటరీస్  ప్రైవెట్  లిమిటెడ్  కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి రియాక్టర్  నుంచి గ్యాస్  లీక్​ అయింది. 

ఈ గ్యాస్​ను ఐదుగురు కార్మికులు పీల్చగా, వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, నారాయణపేట జిల్లా కృష్ణ మండలం అలంపల్లి గ్రామానికి చెందిన గణేశ్(21), మధ్య ప్రదేశ్​కు చెందిన విక్రమ్ సింగ్(36), నిరంజన్ సింగ్(30) ఊపిరాడక స్పాట్​లోనే చనిపోయారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్​ అస్వస్థతకు గురికాగా, వారిని రాయచూర్​ రిమ్స్  హాస్పిటల్​కు తరలించారు. మృతి చెందిన గణేశ్​ ఫ్యామిలీకి మద్దతుగా అలంపల్లి గ్రామస్తులు, వివిధ పార్టీల నేతలు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. గణేశ్​ ఫ్యామిలీకి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని బైఠాయించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు.

కలెక్టర్, ఎస్పీలతో ఫోన్​లో మాట్లాడిన ఎంపీ

గ్యాస్​ లీకేజీ ఘటనపై ఎంపీ డీకే అరుణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. యాదగిరి కలెక్టర్, ఎస్పీలతో ఎంపీ ఫోన్​లో మాట్లాడి అస్వస్థతకు గురైన ఇద్దరికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు యాజమాన్యం పరిహారం అందించాలన్నారు.