హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కాలేరు వెంకటేశ్‌తో కలిసి సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జిలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.680 కోట్లతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి చంచల్‌గూడ జైలు నుంచి ఓవైసీ దవాఖాన వరకు నిర్మాణం పూర్తి చేసుకుందని, చంపాపేట్ వైపు అదనపు కనెక్టివిటీ కూడా కల్పించినట్లు తెలిపారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సంతోష్‌నగర్, చంచల్‌గూడ, సైదాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల మీదుగా ప్రయాణించేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయన్నారు.
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితోపాటు మూసారాంబాగ్ బ్రిడ్జిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ రెండు వంతెనలకు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్లను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. కేబీఆర్ పార్క్సమీపంలో చేపడుతున్న పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు.
మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే చౌరస్తాలను గుర్తించి అవసరమైన చోట కొత్త ఫ్లైఓవర్ల నిర్మించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక ఆల, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ పాల్గొన్నారు.
