కాళేశ్వరం పాపం కేసీఆర్ దే..బియ్యం బుక్కిన రైస్ మిల్లర్లపై చర్యలు తప్పవు

కాళేశ్వరం పాపం కేసీఆర్ దే..బియ్యం బుక్కిన రైస్ మిల్లర్లపై చర్యలు తప్పవు
  • క్షుద్రపూజలపై హరీశ్​రావు వివరణ ఇవ్వాలి
  •     పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్

నిజామాబాద్​ అర్బన్​, వెలుగు: తెలంగాణ ఖజానాను ముంచిన కాళేశ్వరం ప్రాజెక్టు పాపం పూర్తిగా కేసీఆర్​దేనని, ఈ ప్రాజెక్టుపై కేటీఆర్​ చెబుతున్నవన్నీ బూటకపు మాటలేనని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్​లో పర్యటించిన ఆయన డీసీసీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నాణ్యత ఏమిటో డ్యామ్​ సేఫ్టీ అథారిటీ నివేదికలో బయట పడిందన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ద్వారానే ఇప్పుడు సాగునీరు అందుతోందన్నారు. మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదని , కాళేశ్వరం పేర లక్షల కోట్లు ఖర్చయ్యేవి కాదని, భారీగా కరెంట్​ బిల్లులు కట్టాల్సి వచ్చేది కాదన్నారు. కేసీఆర్​ చేసిన తప్పులు మళ్లీ జరగకుండా సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి జాగ్రత్తలు తీసుకొని నీటిపారుదల శాఖ నిపుణుల సూచనలతో పనులు చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయడం లేదో కిషన్​రెడ్డి చెప్పాలన్నారు. 

 బీజేపీ శకం ముగిసినట్లే..

ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీజీపీ శకం ముగిసినట్లు తెలిసిపోతోందని మహేశ్​ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​ ప్రాతినిధ్యం వహించిన బంకీపూర్​లో ప్రశాంత్​ కిశోర్​ విజయం ఆ పార్టీకి చెంప పెట్టులాంటిదన్నారు. మోదీపై భ్రమలు తొలుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. బీఆర్ఎస్​ హయాంలో యథేచ్చగా బియ్యం స్మగ్లింగ్​ జరిగిందని, ఆ పార్టీ నాయకులు కోట్ల రూపాయల స్కామ్​లు చేశారని ఆరోపించారు. రేషన్​ బియ్యాన్ని రీసైక్లింగ్  చేసి సన్న బియ్యంగా మార్చి అమ్ముకున్నారన్నారు. సీఎంఆర్​ ఇవ్వకుండా ఎగనామం పెట్టిన రైస్​ మిల్లర్లను ఉపేక్షించబోమన్నారు. 

క్షుద్ర పూజలపై హరీశ్​రావు వివరణ ఇవ్వాలి..

హరీశ్​ రావు క్షుద్రపూజలు చేశారన్న ఆరోపణలు నిజం కాకుంటే, ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలని మహేశ్​కుమార్​గౌడ్​ అన్నారు. కర్నాటక, తమిళనాడులోని కొన్ని ఆలయాలు క్షుద్రపూజలకు ప్రసిద్ది అని, ఆ ఆలయాల్లో హరీశ్  పూజలు చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. తాము అనుమానాలు లేవనెత్తితే వివరణ ఇవ్వకుండా, కోర్టు నోటీసులు పంపించారని, వాటికి సమాధానం ఇస్తామని తెలిపారు.