ఉదయం నుంచి నష్టాల్లోనే ప్రయాణాన్ని కొనసాగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఊహించని పతనంతో క్లోజ్ అయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలు బేర్స్ పంజా దెబ్బకు కుప్పకూలటంతో ఇన్వెస్టర్ల సొమ్ము దాదాపు రూ.7 లక్షల కోట్ల వరకూ ఆవిరైపోయింది. ప్రధానంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కొత్త ముసాయిదాతో ఫిన్ టెక్ రంగానికి చెందిన డజను స్టాక్స్ విలువ ఏకంగా రూ.లక్ష కోట్ల మేర ఆవిరైపోయింది.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1247 పాయింట్లు నష్టపోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 384 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1110 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1406 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్లకు కన్నీళ్లను మిగిల్చాయి. అయితే ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లను ఇంతలా నష్టాల్లోకి దిగజార్చిన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణాలు:
1. అమెరికా బాండ్ ఈల్డ్స్ దూకుడు:
సెప్టెంబర్‌లో అమెరికా వ్యాపార కార్యకలాపాలు 5 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో.. బాండ్లపై రాబడులు విపరీతంగా పెరిగాయి. బెంచ్‌మార్క్ 10 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 2007 తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి. ఇది డెట్ మార్కెట్ల వైపు పెట్టుబడులను ఆకర్షించి, ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణమైంది. బాండ్ ఈల్డ్స్ పెరుగుదల విదేశీ సంస్థాగత పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని స్టాక్ కార్ట్ సీఈఓ ప్రణయ్ అగర్వాల్ వెల్లడించారు.
2. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్:
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 102.5 డాలర్లకు పైగా ఎగబాకింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రూడ్ దిగుమతి దేశమైన భారత్‌కు క్రూడ్ ధరల పెరుగుదల దిగుమతి బిల్లును పెంచడంతో పాటు.. ద్రవ్యోల్బణ భయాలను, కార్పొరేట్ లాభాలను దెబ్బతీస్తుందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ నిపుణుడు వి.కె. విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
3. బలహీనమైన గ్లోబల్ క్యూస్:
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు వాల్ స్ట్రీట్ మార్కెట్లను కుప్పకూల్చాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడింది. ఎంఎస్‌సీఐ ఆసియా ఈక్విటీస్ సూచీ 0.4 శాతం పడిపోగా, హాంకాంగ్ హాంగ్ సెంగ్, షాంఘై కంపోజిట్ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి.
4. ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుక్కింగ్:
మార్కెట్లు ఇటీవలి కాలంలో సాధించిన లాభాల తర్వాత.. ఇన్వెస్టర్లు అధిక స్థాయిల వద్ద షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. అమెరికా మార్కెట్లు బలహీనంగా ముగియడం.. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించడం వంటివి లాభాల స్వీకరణకు దారితీశాయి.
5. పడిపోయిన రూపాయి విలువ:
అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ బలపడటంతో రూపాయి మారకం విలువ క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు కోల్పోయి 95.84 వద్ద బలహీనంగా ట్రేడైంది.
6. పెరిగిన మార్కెట్ అస్థిరత:
మార్కెట్లలో భయాలను సూచించే 'ఇండియా విక్స్' ఏకంగా 21 శాతానికి పైగా ఎగబాకి 12.56కి చేరింది. ఈ అస్థిరత సూచీ పెరగడం వల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగిందని, మార్కెట్లో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఇది స్పష్టం చేస్తోంది.
7. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు క్రాష్:
దేశీయ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI కమీషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రతిపాదించిన ముసాయిదా ప్రభావం ఫైనాన్షియల్ స్టాక్స్‌పై తీవ్రంగా పడింది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. ముఖ్యంగా పీబీ ఫిన్‌టెక్, టర్టిల్‌మింట్ షేర్లు కుప్పకూలాయి. ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి.
