భారత స్టాక్ మార్కెట్లలో గురువారం పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ షేర్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI తీసుకువచ్చిన కొత్త నిబంధనల ముసాయిదాతో ఈ షేరు ధర ఒకే రోజు ఏకంగా 32 శాతం కుప్పకూలాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో వరుస లోయర్ సర్క్యూట్‌లను తాకిన ఈ స్టాక్.. చివరకు 18 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో కంపెనీపై నమ్మకం ఉంచిన దాదాపు లక్షా 42వేల మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకతను తీసుకురావడానికి, మోసాలను అరికట్టడానికి ఐఆర్‌డీఏఐ ఇటీవల "రీకాలిబ్రేటింగ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్" పేరుతో ఒక సమగ్ర ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అందుకునే కమిషన్లపై కఠినమైన ఆంక్షలు విధించారు. హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదటి ఏడాదికి కమిషన్లు, మోటార్ ఇన్సూరెన్స్ (థర్డ్-పార్టీ అండ్ ఓన్-డ్యామేజ్) కమిషన్లను భారీగా కుదించాలని ఈ ముసాయిదా ప్రతిపాదించింది.
గతంలో ఉన్న కమీషన్ల శాతంతో పోలిస్తే కొత్తగా నిర్ణయించిన క్యాప్స్ చాలా తక్కువగా ఉన్నాయని జెఫ్రీస్, మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు విశ్లేషించాయి. ఉదాహరణకు క్రెడిట్ లైఫ్ పాలసీలపై కమీషన్‌ను ఏకంగా 2 శాతానికి, హెల్త్ ఇన్సూరెన్స్ కమీషన్లను భారీగా తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ కమీషన్ల కోత నేరుగా పీబీ ఫిన్‌టెక్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఆదాయం, మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బ్రోకరేజీలు అంచనా వేశాయి.
బిజినెస్ మోడల్ మారాల్సిందే..
పాలసీ బజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ ప్రధానంగా టెలీ-కాలింగ్, డిజిటల్ లీడ్ జనరేషన్ విధానం ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తూ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతోంది. అయితే ఐఆర్‌డీఏఐ తీసుకువస్తున్న కొత్త రూల్స్ వల్ల కంపెనీ టేక్-రేట్లు పడిపోవడమే కాకుండా, కస్టమర్ల అక్వజిషన్ కాస్ట్ కూడా తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య పీబీ ఫిన్‌టెక్ తన ప్రస్తుత బిజినెస్ మోడల్‌ను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంకే గ్లోబల్ పేర్కొంది.
పెద్ద ఎత్తున ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, కమిషన్ ఆదాయంపై ఆధారపడే పీబీ ఫిన్‌టెక్ భవిష్యత్తు ఆదాయాలపై ఈ మార్పులు తీవ్ర ఒత్తిడిని తెస్తాయని బెర్న్‌స్టెయిన్ లాంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే దీర్ఘకాలిక మదుపర్లు తొందరపడి షేర్లను తక్కువ ధరలకు అమ్మేయకుండా, కంపెనీ మేనేజ్‌మెంట్ ఇచ్చే స్పష్టత కోసం వేచి చూడాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
టెక్నికల్స్ పరంగా షేరు పరిస్థితి ఏంటి?
సాంకేతికంగా చూస్తే.. ఈ స్టాక్ చార్ట్ నిర్మాణం చాలా బలహీనపడింది. గత కొన్ని నెలలుగా రూ.1,400 - రూ. 1,900 శ్రేణిలో కన్సాలిడేట్ అవుతున్న ఈ షేరు.. తాజా పరిణామాలతో కీలకమైన రూ.1,400 సపోర్ట్ స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం ఈ షేరు ముఖ్యమైన మూవింగ్ యావరేజెస్ కంటే దిగువనే ట్రేడవుతోంది. టెక్నికల్ అనలిస్టుల అంచనా ప్రకారం.. షేరు ధర స్వల్పకాలంలో ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉంది. ఈ ముసాయిదా చట్టంపై IRDAI అక్టోబర్ చివరి వరకు ఇండస్ట్రీ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నందున అప్పటివరకు ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగువేయడం మంచిది.
