ఊరికోసం ఒకరోజు.. స్వచ్ఛ సంకల్పం!..కమలాపూర్ మేజర్ పంచాయతీ వినూత్న ఆలోచన

ఊరికోసం ఒకరోజు.. స్వచ్ఛ సంకల్పం!..కమలాపూర్ మేజర్ పంచాయతీ వినూత్న ఆలోచన
  • ఊరి కోసం ఒకరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పాలకవర్గం 
  • ప్రతి శనివారం ఊరిలోని డ్రైనేజీలు, చెత్తచెదారం, పరిసరాలు క్లీన్ చేసేలా ప్రణాళిక 
  •  గ్రామ ప్రజలు, ఉద్యోగుల భాగస్వామ్యంతో ముందుకు..
  •  అదే స్ఫూర్తితో ముందుకొస్తున్న మరికొన్ని గ్రామాలు

హనుమకొండ, వెలుగు: 'స్వాతంత్ర్యం కంటే పారిశుధ్యమే ముఖ్యం' ఇది స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మాగాంధీ చెప్పిన మాట. అదే స్ఫూర్తితో ప్రధాని మోదీ 'స్వచ్ఛ భారత్' ఉద్యమాన్ని మొదలుపెట్టగా, దానిని ఆదర్శంగా తీసుకుని హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ పంచాయతీ వినూత్న ఆలోచన చేసింది. గ్రామాన్ని స్వచ్ఛత వైపు అడుగులు వేయించాలన్న సంకల్పంతో 'ఊరి కోసం.. ఒకరోజు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి శనివారం గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. సర్పంచ్ ఆలోచన మేరకు కమలాపూర్ మేజర్ పంచాయతీ పాలకవర్గం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా, చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలు ఇదే స్ఫూర్తిని అందుకుని ముందుకు సాగుతున్నాయి.

ఊరి కోసం.. ప్రతి శనివారం

కమలాపూర్ మండల కేంద్రంలో దాదాపు 9 వేలకు పైగా జనాభా ఉంది. కాగా, గ్రామంలో పారిశుధ్యం లోపించి, గందరగోళంగా మారగా, కొత్తగా సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న పబ్బు సతీశ్ గ్రామ రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో వినూత్నంగా ఆలోచించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పంచాయతీ పాలకులు, ప్రజలు, ఉద్యోగులు, అధికారులకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రతి శనివారం ఊరిని క్లీన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ప్రతి శనివారం గ్రామంలోని డ్రైనేజీలు శుభ్రం చేయడంతో పాటు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగిస్తున్నారు. 

ప్రతి ఇంటి నుంచి భాగస్వామ్యం ఉండేలా అవగాహన కల్పించి గ్రామంలోని ప్రధాన రోడ్లు, కాలనీలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంతో పరిచయం ఉన్న ప్రముఖులు, ఇక్కడ పని చేసి వెళ్లిన ఉద్యోగులు, కమలాపూర్ నుంచి వెళ్లి ఇతర గ్రామాల్లో స్థిరపడిన వ్యక్తులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు ఈ స్వచ్ఛ ఉద్యమంలో భాగం కల్పిస్తూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రజలందరికీ భాగస్వామ్యం..

గ్రామంలోని ప్రతి పౌరుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే బాధ్యతను గుర్తు చేయడంతో పాటు అందులో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ గత నెల మొదటి వారంలో 'ఊరి కోసం.. ఒకరోజు' కార్యక్రమాన్ని ప్రారంభించి, నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. మే 9న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, దాదాపు ఏడు వారాల నుంచి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని డ్రైనేజీలు, స్కూల్ ఆవరణలు, మెయిన్ సెంటర్లను క్లీన్ చేశారు. కమలాపూర్ సర్పంచ్ చేస్తున్న ఈ పనికి వివిధ సంఘాల ప్రతినిధులు, నేతలు, పోలీస్ ఆఫీసర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇదిలాఉంటే కమలాపూర్ పంచాయతీ చేపడుతున్న ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాల్లోనూ స్ఫూర్తి నింపింది. దీంతో ఇదే మండలంలోని మర్రిపల్లిగూడెం, ఉప్పల్ గ్రామాలు కూడా 'ఊరికోసం.. ఒకరోజు' కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. 

స్వచ్ఛ కమలాపూర్ గా తీర్చిదిద్దుతం..

కేవలం పారిశుధ్య సిబ్బందితోనే గ్రామాన్ని శుభ్రంగా మార్చడం సాధ్యం కాదు. ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామ రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగానే ప్రతి శనివారం శ్రమదానం నిర్వహించేలా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తొందర్లోనే మా గ్రామాన్ని స్వచ్ఛ కమలాపూర్ గా తీర్చిదిద్దుతాం. దేశంలోనే ఆదర్శ గ్రామంగా రూపొందేలా కృషి చేస్తాం.- పబ్బు సతీశ్, సర్పంచ్, కమలాపూర్