- ఐదు రోజుల్లో 14 మందిపై కేసులు
- రైడ్స్ భయంతో కొన్నిచోట్ల దుకాణాలు మూసుకుంటున్న నిర్వాహకులు
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెల్ట్‌షాపులపై స్పెషల్ రైడ్స్ చేపడుతున్నారు. పగలు రాత్రీ తేడా లేకుండా విచ్చలవిడిగా షాపులు నడిపిస్తుండడంతో మందుబాబులు నిత్యం మత్తులో ఉంటున్నారు. ఒక్కో ఊరిలో కనీసం ఐదు నుంచి పది వరకు బెల్టుషాపులు నడుస్తున్నాయి. చాలాచోట్లా బార్‌లను తలపించేలా 24 గంటల సర్వీస్ అందుబాటులో ఉండటంతో యూత్ మత్తులో జోగుతూ గొడవలకు దిగుతున్నారు.
ఈక్రమంలో సీపీ శ్వేతారెడ్డి ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెల్టుషాపులపై ఫోకస్ పెట్టారు. వరుస రైడ్స్‌తో బెల్ట్‌షాపుల నిర్వాహకులను హడలెత్తిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టి పెద్ద మొత్తంలో బీర్, లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో సమాచారం అందుకున్న బెల్టుషాపుల నిర్వాహకులు మూడు, నాలుగు రోజులుగా షట్టర్లు క్లోజ్ చేశారు.
సీపీ ఆదేశాలతో కదిలిన టాస్క్ ఫోర్స్
బెల్టుషాపుల బాగోతం ఇటీవల వరంగల్ సీపీగా ఛార్జ్ తీసుకున్న ఎన్.శ్వేతారెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో సీపీ ఆదేశాల మేరకు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నెల 1 నుంచి కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వరంగల్ ఈస్ట్ జోన్ పరిధిలోని సంగెం, గీసుగొండ, ఏనుమాముల, వెస్ట్ జోన్ పరిధిలోని జనగామ, స్టేషన్ ఘన్ పూర్, రఘునాథపల్లి, సెంట్రల్ జోన్ పరిధిలోని మడికొండ, హసన్‌పర్తి పీఎస్ ల పరిధిలో సోదాలు చేశారు. ఐదురోజుల్లో 14 మందిపై కేసులు నమోదు చేసి, రూ.4.67 లక్షలకుపైగా విలువైన 863 బీర్ బాటిల్స్, 1500కుపైగా బ్రాందీ, విస్కీ, ఇతర మద్యం సీసాలను స్వాధీనం
చేసుకున్నారు.
తనిఖీలు కొనసాగేనా..?
ఈ నెల 1 నుంచి బెల్ట్‌షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. విషయం తెలుసుకుని చాలాచోట్లా బెల్ట్ షాపుల నిర్వాహకులు ముందు జాగ్రత్తగా షాపులు మూసేశారు. గ్రేటర్ సిటీ శివారులో మాత్రమే ఈ పరిస్థితి కనిపిస్తోంది. మిగతా చోట్లా మాత్రం యథావిధిగానే షాపులు కొనసాగుతుండటం గమనార్హం. కాగా కమిషనర్ ఆదేశాలతో తనిఖీల పేరున హడావుడి చేస్తున్న ఆఫీసర్లు ఆ తరువాత లైట్ తీసుకోవడం మామూలేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకట్రెండు రోజులు సోదాలు చేయడం, ఆ తరువాత వివిధ కారణాల సాకుతో చేతులు దులిపేసుకోవడం కామన్ అయిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా బెల్టుషాపుల వల్ల క్షేత్రస్థాయిలో కుటుంబాలు అన్నివిధాలుగా దెబ్బతింటుండటంతో పాటు గొడవలు, యువకుల న్యూసెన్స్ ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇకనైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మహిళా సంఘాలు, వివిధ పంచాయతీల పాలకవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
24 గంటలు అందుబాటులో లిక్కర్..
కమిషనరేట్ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో బెల్టుషాపుల దందా విచ్చలవిడిగా నడుస్తోంది. షాపులో ముందు వైపు కిరాణం, హోటల్స్ నడిపిస్తూ.. మరోవైపు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. వైన్స్ షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నడుస్తుంటే.. బెల్టుషాపులు మాత్రం 24 గంటల పాటు నడిపిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై ఎమ్మార్పీపై కన్నా రూ.20 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు గ్రేటర్ వరంగల్ సిటీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైన్స్, బార్ లను తలపించేలా ఏర్పాట్లు చేస్తుండటం, ఎనీ టైం లిక్కర్ దొరుకుతుండటంతో చాలామంది యూత్, పెద్దలు మద్యానికి బానిసలుగా మారుతున్నారు.
