బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌కు ముంబైలో జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఊహించని సంఘటన ఎదురైంది. వర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ మై డాగ్’ (Ohh My Dog) స్పెషల్ ప్రీమియర్స్కు హాజరైన రవీనా, రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. అయితే ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్టేజీపైనే రవీనాపై దూకిన శునకం..
‘ఓ మై డాగ్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన శునకంతో కలిసి ఫొటోలకు పోజులిచ్చేందుకు రవీనా టాండన్ స్టేజీపైకి వెళ్లారు. ఫొటోగ్రాఫర్ల కోసం కిందకు వంగి పోజ్ ఇచ్చిన అనంతరం పైకి లేస్తుండగా, ఆ శునకం ఒక్కసారిగా తీవ్రంగా మొరుగుతూ ఆమెను కరవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో రవీనా ధరించిన దుస్తుల దారాలు శునకం నోటికి చిక్కుకున్నాయి. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ, రవీనా.. ఏమాత్రం భయపడకుండా ఎంతో ఓపికగా కుక్కను నిమురుతూ శాంతింపజేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవీనా చూపించిన సంయమనం, జంతువుల పట్ల ఆమెకున్న ప్రేమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్ద స్టార్ అయినప్పటికీ హంగామా చేయకుండా ప్రశాంతంగా వ్యవహరించడం అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే, తర్వాత ఈ ఘటనపై స్పందించిన రవీనా టాండన్, తనకు ఎలాంటి గాయం కాలేదని స్పష్టం చేసింది. కుక్క తనను కరవలేదని, కేవలం తన డ్రెస్‌కు సంబంధించిన ఒక దారం ప్రమాదవశాత్తు దాని నోటిలో చిక్కుకుందని తెలిపింది.
జంతు ప్రేమకు ఇదే నిదర్శనం: రవీనాపై ప్రశంసలు..
కుక్క మీదికి వస్తుందంటే ఎవ్వరికైనా భయమే. ఒకవేళ అది కరవడానికి ప్రయత్నించిన క్షణం వస్తే.. చాలా మంది భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, రవీనా టాండన్ మాత్రం ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఎంతో ప్రశాంతంగా వ్యవహరిస్తూ శునకాన్ని నిమురుతూ దానిని శాంతింపజేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె చూపిన ఓర్పు, సంయమనం అక్కడున్నవారిని ఆకట్టుకోగా, సోషల్ మీడియాలోనూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
►ALSO READ | OTT Thriller: వీకెండ్‌కు పర్ఫెక్ట్ తమిళ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే?
ఒక నెటిజన్, ‘కెమెరా లైట్లు, పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహం కారణంగా శునకం ఒత్తిడికి గురై ఉండొచ్చు. అలాంటి సమయంలో రవీనా టాండన్ ఎంతో దయతో, ఓపికగా వ్యవహరించారు. నిజమైన జంతు ప్రేమికురాలు అంటే ఇలానే ఉండాలి’ అని ప్రశంసలు కురిపించారు. మరో నెటిజన్, ‘చిన్న సంఘటన జరిగినా పెద్ద హడావుడి జరిగే ఈవెంట్లలో, అంత పెద్ద స్టార్ అయిన రవీనా టాండన్ ప్రశాంతంగా పరిస్థితిని చక్కదిద్దడం అభినందనీయం’ అని పేర్కొన్నారు.
జంతువులపై ప్రేమను చాటే ‘ఓ మై డాగ్’..
అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ‘ఓ మై డాగ్’ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. వరుసగా అదృశ్యమవుతున్న శునకాల వెనుక ఉన్న ముఠా గుట్టును ఓ ధైర్యవంతమైన కుక్క ఎలా బయటపెట్టిందనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో పంకజ్ త్రిపాఠితో పాటు పవన్ మల్హోత్రా, మాహి రాయ్, రాజేష్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ, ‘‘శునకాలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మనపై ప్రేమ, విశ్వాసం చూపిస్తాయి. జంతువుల పట్ల దయ, కరుణతో వ్యవహరించాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించాలనుకున్నాం. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల్లో జంతువులపై మరింత ప్రేమ పెరిగితే మా ప్రయత్నం ఫలించినట్టే’’ అని తెలిపారు.
థియేటర్లలో అలరిస్తున్న ‘ఓ మై డాగ్’..
బాబులాల్ బయోస్కోప్, థింకింగ్ హ్యాట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అమిత్ రాయ్, రాజేష్ భరద్వాజ్, సనా వార్సీ నిర్మించిన ‘ఓ మై డాగ్’.. ఇవాళే (ఆగస్టు 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని అలరిస్తుంది.
