చదువుల గుడి ఎప్పుడు కూలుతుందోనని ఆ చిన్నారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బడికి వెళ్తున్నారు. నిత్యం భయం నీడనే చదువు సాగిస్తున్న ఈ దుస్థితి మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ మండలం చీమ్లా తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోనిది.
ఈ స్లాబ్ ఎప్పుడు ఊడిపడుతుందో, ఏ క్షణంలో పెచ్చులు రాలి మీద పడతాయో తెలియని పరిస్థితి. పైకప్పు స్లాబ్ పూర్తిగా శిథిలమై, ఇనుప రాడ్లు బయటకు తేలిపోయాయి. గతంలోనూ ఇలాగే పెచ్చులు పడి పలువురు విద్యార్థులు గాయపడిన ఘటనలు ఉన్నప్పటికీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
►ALSO READ | కంటెంప్ట్ కేసులో హైకోర్టు ఎదుట.. IAS సందీప్ సుల్తానియా హాజరు
కలెక్టర్ మేడం.. మీకు దండం పెడతం.. మాకు కొత్త బిల్డింగ్ మంజూరు చేయండి అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక సర్పంచ్ హరిలాల్ వేడుకుంటున్నారు. పిల్లలను బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు స్పందించి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ పాఠశాలకు తక్షణమే కొత్త భవనాన్ని మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
