హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండి వేలాది మంది ఆదివాసీలకు ప్రాణాధారంగా నిలిచిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక, సిబ్బంది కొరతతో రోగులు పడుతున్న అవస్థలను ఆయన లేఖలో వివరించారు. హాస్పిటల్‌లో కనీస సౌకర్యాలు లేక, డాక్టర్ల కొరతతో రోగులు అల్లాడిపోతున్నారని తెలిపారు.
హాస్పిటల్‌లో మొత్తం 62 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 22 మంది మాత్రమే పని చేస్తున్నారని చెప్పారు. కీలకమైన సివిల్ సర్జన్లు 16 మంది ఉండాల్సి ఉండగా, కేవలం ముగ్గురే ఉన్నారని, ఆర్థోపెడిక్, పిల్లల వైద్యులు, ఈఎన్‌టీ వంటి స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. 53 మంది నర్సులకు గాను 28 మందే ఉండటంతో, ఒక్కో నర్స్ మూడు వార్డుల బాధ్యతలు చూడాల్సి వస్తోందని, పని ఒత్తిడి పెరిగి రోగులకు సరైన సేవలు అందడం లేదని వివరించారు. 200 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిలో ఎప్పుడూ 250మందికిపైగా రోగులు ఉంటున్నారని, బెడ్లు దొరక్క పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం చెల్లించి పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
