ఆయిల్పామ్ సాగుకే మొగ్గు..అవగాహనతో పంట సాగుకు ముందుకు వస్తున్న రైతులు 

ఆయిల్పామ్ సాగుకే మొగ్గు..అవగాహనతో పంట సాగుకు ముందుకు వస్తున్న రైతులు 
  •  అంతర పంటల సాగుతో అధిక లాభాలు
  •  గెలల ధర పెంపుతో సాగు రైతులకు ఊరట
  •  ప్రోత్సాహం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
  •  ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  సాగుబాటలో రైతులకు కూలీల కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. మరోవైపు వరి, మొక్కజొన్న పంటల విక్రయాల్లో ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం సంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తుండటంతో రైతులు స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగువైపు అడుగులు వేస్తున్నారు. వరి, మొక్కజొన్న పంటలకు ఒక ఎకరాకు అవసరమయ్యే నీటితో మూడు ఎకరాల వరకు ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తుండటంతో రైతులు వరి, మొక్కజొన్నకు బదులుగా ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగును ఎంచుకుంటున్నారు. అదనంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వంటనూనెలకు పెరుగుతున్న డిమాండ్, గెలల ధరల పెరుగుదల రైతులను ఈ పంట సాగుకు ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. పంట సాగుపై రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

సర్కార్ సాయం..

ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4,500 ఎకరాలు, వరంగల్ లో 6,200, ములుగులో 1,134, హనుమకొండలో 3,921, జనగామలో 8,333, మహబూబాబాద్ జిల్లాలో 8,682 ఎకరాల్లో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగు కొనసాగుతోంది. బహిరంగ మార్కెట్​లో ఒక ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ మొక్క ధర రూ.193 వరకు ఉండగా, ప్రభుత్వం నర్సరీల్లో ఏడాది పాటు పెంచిన 10 ఆకుల మొక్కను రైతులకు కేవలం రూ.20కే అందిస్తోంది.

ఎకరానికి 50 మొక్కలు అవసరమవుతాయి. ఈ మేరకు రైతులకు రూ.9,650 వరకు రాయితీ లభిస్తోంది. తోట నిర్వహణకు రూ.2,100, అంతర పంటల నిర్వహణకు మరో రూ.2,100 చొప్పున ఏడాదికి మొత్తం రూ.4,200 సాయం అందిస్తున్నారు. నాలుగేళ్లపాటు రైతులకు మొత్తం రూ.16,800 వరకు ప్రోత్సాహకం లభిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కూడా రాయితీపై అందిస్తున్నారు. ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ తోట సగటున 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 4వ ఏడాది నుంచి ఎకరానికి సంవత్సరానికి సుమారు 5 టన్నుల దిగుబడి రాగా, 7వ ఏడాది నుంచి 10 టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ప్రారంభమైన దిగుబడులు.. 

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2022లో ప్రారంభమైన ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగు ఇప్పుడు దిగుబడులు ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో 662 టన్నుల దిగుబడి నమోదుకాగా, మహబూబాబాద్ లో అత్యధికంగా 6,800 టన్నుల దిగుబడి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాదికి దిగుబడి మరింత పెరిగే అవకాశముందని ఉద్యానవన శాఖ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది మరో 2,500 ఎకరాల్లో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగు విస్తరించేందుకు ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ నాటిన నాలుగేళ్ల తర్వాతే దిగుబడి చేతికి వస్తుంది. ప్రారంభంలో దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ, తర్వాతి సంవత్సరాల్లో క్రమంగా పెరిగి రైతులకు లాభదాయక పంటగా మారుతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ మంది కూలీలతో స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉండటంతో రైతులు ఈ పంట సాగుపై 
ఆసక్తి చూపుతున్నారు.

రైతులకు ప్రోత్సాహం..

ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫామ్ సాగు చేస్తున్న రైతులను కంపెనీ తరఫున ప్రోత్సహిస్తున్నాం. తొలి నాలుగేళ్ల పాటు దిగుబడి రాకపోవడంతో రైతులు నిరుత్సాహపడకుండా కంపెనీ గ్యారెంటీతో బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నాం. ఆ రుణాలతో రైతులు తోటలకు కంచెలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భూములను డెవలప్​ చేసుకుంటున్నారు. తొలిదశలో 100 ఎకరాల్లో సాగు చేపట్టిన 50 మంది రైతులకు రూ.2.50 కోట్ల రుణాలు అందించాం. ఈ ఏడాది 2,500 ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి.
-గండ్ర గౌతమ్ రెడ్డి, సువెన్ ఆగ్రో ఇండస్ర్టీస్ ఎండీ