వెలుగు ఓపెన్ పేజీ.. స్వదేశీ స్ఫూర్తికి చేనేత ప్రతిబింబం!

వెలుగు ఓపెన్ పేజీ.. స్వదేశీ స్ఫూర్తికి చేనేత ప్రతిబింబం!

ఆగస్టు 7 భారత చరిత్రలోఒక  విశిష్టమైన రోజు. దేశ  స్వాతంత్ర్యోద్యమంలో స్వదేశీ ఉద్యమానికి నాంది పలికిన ఈ రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం  జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణం.  చేనేత  మన  సంప్రదాయం.. స్వాభిమానం. 

ఇది భారతీయ సంస్కృతికి చిరునామా.చేనేత వస్త్రం అనేది దేశభక్తికి, ఆత్మగౌరవానికి ప్రతీక.  భారతదేశపు  సంస్కృతీ, సంప్రదాయాలను  ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వారసత్వం చేనేత పరిశ్రమ.  భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన చేనేత వస్త్ర సంప్రదాయం ఉంది.  తెలంగాణలో  పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట చీరలు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి వస్త్రాలు,  తమిళనాడులో కాంచీపురం, వారణాసి పట్టు చీరలు, అస్సాం, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల చేనేత కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళా వైభవాన్ని చాటుతున్నాయి.

స్వాతంత్ర్య సమరంలో ప్రధాన పాత్ర

భారత స్వాతంత్ర్య సమరంలో చేనేత కీలక పాత్ర పోషించింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను ధరించాలనే పిలుపు దేశవ్యాప్తంగా జాతీయ చైతన్యాన్ని కలిగించింది. మహాత్మా గాంధీ చరఖాను స్వావలంబనకు, స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిపారు. ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా దేశ ప్రజల్లో స్వదేశీ భావనను పెంపొందించారు.  నేటి ఆధునిక యుగంలో యంత్రాలతో తయారయ్యే వస్త్రాలు మార్కెట్‌‌‌‌ను ఆక్రమిస్తున్నప్పటికీ, చేనేతకు ఉన్న  ప్రత్యేకత  ఏమాత్రం తగ్గలేదు. 

చేనేత వస్త్రాలు ప్రకృతికి అనుకూలమైనవి, శరీరానికి సౌకర్యవంతమైనవి, పర్యావరణ హితమైనవి.  ప్రతి చేనేత వస్త్రం వెనుక ఒక కుటుంబం జీవనోపాధి, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ జ్ఞానం దాగి ఉంటుంది. అందుకే  చేనేతను ప్రోత్సహించడం అంటే గ్రామీణ భారతదేశాన్ని, సంప్రదాయ కళలను,  శ్రమజీవుల గౌరవాన్ని కాపాడటమే.   ‘వోకల్ ఫర్ లోకల్’ అనే భావనకు  చేనేత అత్యుత్తమ ఉదాహరణ.

 వారసత్వ పరిరక్షణకు సహకారం అవసరం

ప్రస్తుత కాలంలో చేనేత రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.  ముడిసరుకుల ధరల పెరుగుదల,  యంత్ర వస్త్రాల పోటీ,  మార్కెటింగ్ సమస్యలు,  యువతలో ఆసక్తి తగ్గడం వంటి అంశాలు ఈ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో  ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు, ప్రజలు కలిసి చేనేత పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.  జాతీయ చేనేత దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చుకోవాలి.  విద్యాసంస్థల్లో  చేనేత ప్రదర్శనలు,  అవగాహన  సదస్సులు,  చేనేత వస్త్రాల ప్రదర్శన– అమ్మకాలు నిర్వహించాలి. ప్రభుత్వ కార్యాలయాలు,  విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు  ధరించడం ద్వారా చేనేతకు సంఘీభావం తెలియజేయాలి.   

భారతీయ చేనేతకు ప్రత్యేక గుర్తింపు

ప్రపంచ మార్కెట్‌‌‌‌లో భారతీయ చేనేతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును మరింత బలోపేతం చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత.  చేనేతను ఆదరించడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థకు, గ్రామీణాభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు మనవంతు సహకారం అందించాలి.   చేనేతను ఆదరిద్దాం... నేత కార్మికుడిని  గౌరవిద్దాం.  స్వదేశీ 
వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం. ఇదే జాతీయ చేనేత దినోత్సవం సందేశం.

-పగుడాకుల బాలస్వామి,
ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.