- టెక్నికల్బిడ్లో అర్హత సాధించని సంస్థల కోసం గడువు పొడిగింపుపై విమర్శలు
- భారీ మొత్తంలో చేతులు మారాయనే ఆరోపణలు
నల్గొండ, వెలుగు : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్ టెండర్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి అర్హులకు పనులు అప్పగించాల్సిన అధికారులు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత ఉన్న సంస్థలను పక్కనపెట్టి, టెక్నికల్ సర్టిఫికెట్లు లేని వారికి మేలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నిబంధనలకు నీళ్లు..
ఎంజీయూలో 11 ఔట్ సోర్సింగ్ పోస్టుల కోసం ఈ ఏడాది జూన్ 18న అధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ ప్రక్రియలో మొత్తం 10 ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఈ నెల 4న టెండర్ బాక్సులను ఓపెన్ చేశారు. పాల్గొన్న 10 సంస్థల్లో కేవలం మూడు మాత్రమే టెక్నికల్ గా అర్హత సాధించాయి. మిగిలిన ఆరు సంస్థలకు టెక్నికల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో వాటిని పక్కనపెట్టాల్సి ఉంది. కానీ ఇక్కడే అధికారులు చక్రం తిప్పారు. టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించని సంస్థల కోసం ఆగస్టు 20 వరకు గడువు ఇవ్వడం వివాదాస్పదమైంది. తమ అనుకూల సంస్థలు సర్టిఫికెట్లు సమర్పించుకునేందుకే ఈ అదనపు సమయం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ టెండర్ డ్రామా వెనుక భారీ స్థాయిలో వసూళ్లు జరిగాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సుమారు 100 మంది ఉద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా రూ. 2 కోట్ల వరకు చేతులు మారాయని, అందుకే అనర్హులని తెలిసినా.. నిబంధనలను తుంగలో తొక్కి మరీ టైమ్ ఇస్తున్నారని బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
ఇటీవల యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను ఆధార్ నెంబర్లతో లింకు చేసి ఆర్ధిక శాఖ పోర్టల్ లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల కంటే 100 మంది అక్రమంగా జీతాలు పొందినట్లు తేలింది. ఇదే తరహాలో యూనివర్సిటీలో మంజూరు చేసిన 11పోస్టులకు మరో 5 అదనంగా16 పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
అర్హత గల ఏజెన్సీలు ఉండగా, లేని వారికి మేలు చేయడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, అక్రమాలను అడ్డుకోవాలని విద్యావేత్తలు, స్టూడెంట్యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
