హనుమకొండ, వెలుగు: బీఆర్ఎస్ నాయకులు హైనాలకంటే డేంజర్ అని, నిజాలు మాట్లాడటం మానేసి తప్పుడు ప్రచారాలనే పనిగా పెట్టుకున్నారని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. గతంలో ఓరుగల్లుకు వచ్చిన కేసీఆర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులిస్తామని హామీ ఇచ్చి అటే వెళ్లిపోయిండని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.5 వేలకు పైగా కోట్లతో అండర్ గ్రౌండ్ నిర్మిస్తుంటే ఆయన కూతురు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతోందన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేసిన అన్యాయానికి ఇక్కడి జనాలు చెప్పులతో కొడతారని ధ్వజమెత్తారు. హరీశ్ రావు, కేటీఆర్ ఎన్నికలున్నప్పుడే వరంగల్ కు వస్తారని, మాయమాటలు చెప్పి రెచ్చగొడతారన్నారు. పదేండ్ల పాలనలో ఓరుగల్లుకు ఇచ్చిన వాగ్ధానాలు ఏమయ్యాయని ప్రజలు నిలదీయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ భద్రకాళీ మాడవీధుల నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెచ్చిన ఫండ్స్ కూడా తమ హయాంలోనే తెచ్చినట్లు చెప్పుకుంటున్నాడని విమర్శించారు.
కుడా భూములపై బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులకు మాటల హడావుడి తప్ప ఏమీ లేదని, సెంట్రల్ నుంచి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రేపోమాపో టెండర్లు పిలిచే సమయంలో బీజేపీ నేతలు సెంట్రల్ ఫండ్స్ తోనే పనులు చేపడుతున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం బాలసముద్రంలోని ఎకరంన్నర భూమిని కబ్జా చేశారని, దీనిపై కోర్టుకు వెళ్తే స్టేలు తెచ్చుకుంటూ సాగదీస్తున్నారని, ప్రపంచంలో ట్యాక్స్ కట్టని ఏకైక ఆఫీస్ బీఆర్ఎస్ దేనని ఎమ్మెల్యే నాయిని విమర్శించారు. వరంగల్ నగరంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను రికవరీ చేసేందుకు హైడ్రా తరహాలో ఇక్కడ కూడా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
