రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంట్‌కు కల్పించారు. ఈ రాజ్యాంగ అధికారంతో రాజ్యాంగంలోని ప్రకరణలను తొలగించడం, చేర్చడం, మార్పు చేయడం వంటి సవరణలు చేయవచ్చు. దేశంలో అత్యవసర పరిస్థితి కాలంలో 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ వివాదాస్పదమైంది. ఈ సవరణ సుదీర్ఘమైంది. దీనిని మినీ రాజ్యాంగంగా పరిగణిస్తారు. స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసుల ద్వారా ఈ సవరణ చేశారు.
- ప్రవేశిక లేదా అవతారికలో కొత్తగా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు.
- నాలుగు– ఏ అనే కొత్త భాగంగా 51–ఎ కింద పౌరుల బాధ్యతలను, విధులను చేర్చారు.
- పరిపాలన ట్రిబ్యునళ్లు, ట్రిబ్యునళ్ల ఏర్పాటు (14–ఎ).
- 1971 జనాభా లెక్కల ప్రకారం 2001 వరకు లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో మార్పులు లేకుండా చేశారు.
- న్యాయ సమీక్షాధికారం తగ్గింపు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయపరిధి కుదింపు.
- రాజ్యాంగ సవరణలను ఏ కోర్టులోనూ ప్రశ్నించకూడదు.
- లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల కాలపరిమితి ఐదేండ్ల నుంచి ఆరేండ్ల వరకు పొడిగింపు.
- ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఎక్కువ అని, ఆ రెండూ ఎక్కడైతే విభేదిస్తాయో అక్కడ ఆదేశిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత కల్పించారు.
- పార్లమెంట్ జాతి వ్యతిరేక కార్యకలాపాల మీద చట్టం చేసే అధికారం కలిగి ఉండటం, ఈ చట్టాలు ప్రాథమిక హక్కుల మీద ఆధిక్యత కలిగి ఉంటాయి.
- మూడు కొత్త ఆదేశిక సూత్రాలు సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం, శ్రామికులకు యాజమాన్యంలో భాగస్వాములు చేయడం, పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ.
- భారత భూభాగంలో ఏ ప్రాంతానికైనా అత్యవసర పరిస్థితిని విధించేలా మార్పు చేసింది.
- రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పొడిగింపు.
- రాష్ట్రాల్లో శాంతిభద్రతలు క్షీణించిన పక్షంలో కేంద్రం సైనిక దళాలను మోహరించే అధికారం కల్పించారు.
ఐదు అంశాలు రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్పు
- విద్య,
- అడవులు,
- వన్యప్రాణుల రక్షణ,
- నికలు కొలతలు,
- సుప్రీంకోర్టు – హైకోర్టులను తప్పించి మిగతా అన్ని కోర్టుల పరిపాలన, నిర్మాణం, నిర్వహణ.
