- మేడారం, మంగపేటలో చెట్లు కూలిన ఘటనల్లో ప్రాథమిక అంచనా
- అడవుల నరికివేతే సమస్యకు కారణమవుతుందన్న ఆఫీసర్లు
- వృక్ష సంపద పెంచకుంటే మరింత నష్టమని వెల్లడి
వరంగల్/ములుగు/మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మేడారం, మంగపేట మండలం కోమటిపల్లి సమీపంలో సుడిగాలులకు భారీ వృక్షాలు నేలకూలిపోవడానికి అడవుల నరికివేతే కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. చెట్టుకు చెట్టు ఆసరా తగ్గి టోర్నడో గాలులకు నేల వాలుతున్నాయని ఆఫీసర్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వృక్ష సంపద పెంచకుంటే భవిష్యత్లో మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
వరుస ఘటనలతో ఆందోళన..
ములుగు జిల్లాలో 2024 ఆగస్ట్ 31న బలమైన గాలులు, భారీ వర్షానికి 2 కిలోమీటర్ల పొడవునా 830 ఎకరాల్లో 82 వేలకుపైగా చెట్లు పడిపోయాయి. ఇందులో అరుదైన తునికి, దుంపెన, తానిక్కాయ, విషముష్టి, యూకలిప్టస్, కానుగ, జువ్వి చెట్లు వంటి 150 రకాల అత్యంత విలువైన వనసంపద నేలవాలింది. రూ.152.64 కోట్ల నష్టం వాటిల్లినట్లు అటవీ శాఖ అధికారులు అప్పట్లో అంచనా వేశారు. అదే ఏడాది డిసెంబర్ 4న ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది.
వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఏరియాల్లో పలుచోట్ల భూమి కంపించగా.. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్‍పై 5.3 తీవ్రత నమోదైంది. 40 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న ములుగు జిల్లా కమలాపురం, ఏటూరునాగారం ప్రధాన రహదారిలో సుడిగాలి ప్రతాపానికి రోడ్డుకు ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున వృక్షాలు నేలకూలాయి. ఈక్రమంలోనే జులై 28న ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి సమీపంలో 1.6 హెక్టార్లలో 150 వరకు భారీ చెట్లు నేలకూలాయి.
నేల వదులై వేర్లు పైకి తేలుతున్నయ్..
ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్లే విధ్వంసం జరిగిందని పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్లుగా జరిగిన ఘటనలపై ఇప్పటికే భారత వాతావరణ శాఖ(ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‍ఆర్‍ఎస్‍సీ) పరిశోధనలు చేపట్టాయి. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి, తీవ్రతను లెక్కిస్తున్నాయి. మంగపేట మండలం కోమటిపల్లి ప్రాంతాలను ఆదివారం కేయూ పరిశోధక బృందంతో కలిసి పర్యావరణ, వృక్ష శాస్త్రవేత్త సుతారీ సతీశ్ పరిశీలించారు. దీనికి రెండు రోజుల ముందు హైదరాబాద్ దుండిగల్ ఫారెస్ట్ కాలేజీకి చెందిన వృక్ష శాస్త్ర ఫైనాలియర్ స్టూడెంట్స్ సైతం సందర్శనకు వచ్చి ఘటనకు కారణాలను అన్వేషించారు.
మంగళవారం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రభాకర్‍తో పాటు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వికాస్ మీనా సిబ్బందితో కలిసి మంగపేట టోర్నడో ప్రభావిత ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా, వీరందరి పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలకు భూసారం కొట్టుకుపోయి భూమి వదులుగా మారింది. చెట్టు పైకి పెరిగినట్లుగా.. తల్లివేరుతో పాటు ప్రధాన వేర్లు అదే స్థాయిలో లోపలకు చొచ్చుకుపోవాల్సి ఉండగా.. అవన్నీ నేలపైనే విస్తరిస్తున్నాయి. వేర్లు భూమి లోపల ఒక చెట్టుకు మరొకటి బలంగా పెనవేసుకుని ఆసరాగా ఉండాల్సి ఉండగా అలా జరగట్లేదు. ఇలా భారీ వృక్షాల అడుగు భాగంలో బలం తగ్గుతోంది. దీనికితోడు చెట్లను నరికివేయడంతో ఏర్పడిన ఖాళీల వల్ల టోర్నడో వంటి బలమైన గాలులు వీచిన సమయాల్లో సుడిగాలులు వృక్షాలపై విరుచుకుపడుతున్నాయి. చెట్టుకు మరో చెట్టు ఆధారం కరువై ఒక్కొక్కటిగా వరుసబెట్టి వేలాదిగా నేలకూలుతున్నట్లు అంచనా వేశారు.
మేలుకోకుంటే మరింత నష్టం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారికంగా 3,67,353 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కాగా, వాస్తవంగా లక్షన్నర హెక్టార్లకు పడిపోయినట్లు చెబుతున్నారు. ఓవైపు అడవిని నరికివేస్తుండగా.. మరోవైపు టోర్నడోలు, క్లౌడ్ బరెస్ట్తో భారీగా చెట్లు నేలకూలుతున్నాయి. ఇప్పటికైనా వృక్ష సంపద పెంచకుంటే భవిష్యత్తులోనూ ఇదే తరహా నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ, వృక్ష శాస్త్ర సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
