- స్వయంగా గల్ఫ్ లో పర్యటించేందుకు మంత్రి నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటు హక్కుపై ఆందోళన చెందుతున్నారు. తెలంగాణకు చెందిన సుమారు15 లక్షల మంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ ఓటర్ల జాబితా కొనసాగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై గల్ఫ్ ప్రతినిధులు ఆదివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా ఆన్‌లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రతిపాదనలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. అలాగే తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, కార్మికులతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. వారి ప్రతిపాదనకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
