న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడటంతో దేశీయ ప్రైమరీ మార్కెట్ (ఐపీఓ మార్కెట్) మళ్లీ పుంజుకుంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలోపేతం కావడంతో ఈ వారం మూడు ప్రధాన కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించనున్నాయి. మరికొన్ని మెగా ఐపీఓలు కూడా లైన్‌లో ఉన్నాయి.
వాటర్‌వేస్ లీజర్ టూరిజం : విలాసవంతమైన క్రూయిజ్ లైనర్ ‘కార్డెలియా క్రూయిజెస్’ను ఆపరేట్ చేస్తున్న ఈ కంపెనీ, ఐపీఓ ద్వారా రూ. 585 కోట్లను సేకరించాలని చూస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ జూన్ 23న ప్రారంభమై జూన్ 25న ముగుస్తుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 769– 808 గా నిర్ణయించారు. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ మాత్రమే. సేకరించిన నిధులను లీజు చెల్లింపులు, కంపెనీ విస్తరణకు
వాడనున్నారు.
అద్విత్ జ్యూయెల్స్ : జైపూర్‌కు చెందిన ఈ కంపెనీ సాంప్రదాయ హ్యాండ్‌క్రాఫ్టెడ్ ‘పోల్కి’, ‘కుందన్’ ఆభరణాలను తయారు చేస్తోంది. రూ. 165.16 కోట్ల విలువైన ఈ ఇష్యూ కూడా జూన్ 23 నుంచి జూన్ 25 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్‌ను షేరుకు రూ. 130 -– రూ. 138 గా ఫిక్స్ చేశారు. ఇందులో 1.20 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు.
సీఎస్‌ఎమ్ టెక్నాలజీస్: ఈ కంపెనీ ఐటీ సొల్యూషన్స్, టెక్నాలజీ సర్వీస్‌లను అందిస్తోంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 146 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఈ ఐపీఓ జూన్ 24న తెరుచుకుని జూన్ 27న ముగుస్తుంది. ఒక్కో షేరు రూ. 107– - రూ. 113 రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది.
నాక్ ప్యాకేజింగ్: ప్యాకేజింగ్ రంగంలోని ఈ సంస్థ వచ్చే వారం తన రూ. 475 కోట్ల ఐపీఓ కోసం ప్రైస్ బ్యాండ్ ప్రకటించనుంది. గుజరాత్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఈ నిధులను కేటాయించనుంది.
ఐపీఓకి రెడీ..
క్విక్ కామర్స్ యూనికార్న్ జెప్టో మార్కెట్ నుంచి ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా సేకరించడానికి సిద్ధమవుతోంది. ఎస్‌బీఐ ఎంఎఫ్ వచ్చే నెలలో రూ. 13 వేల కోట్ల భారీ పబ్లిక్ ఇష్యూను తీసుకురానుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ , రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ కూడా తమ ఐపీఓ డ్రాఫ్ట్ పేపర్లను సెబీకి సమర్పించాయి.
