ఇరాన్ – అమెరికా చర్చలపై మార్కెట్ ఫోకస్‌‌... కొనుగోలుదారులుగా మారిన ఎఫ్‌‌ఐఐలు

ఇరాన్ – అమెరికా చర్చలపై మార్కెట్ ఫోకస్‌‌... కొనుగోలుదారులుగా మారిన ఎఫ్‌‌ఐఐలు

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌‌ను ప్రధానంగా అమెరికా-–ఇరాన్  మధ్య శాంతి చర్చలు,  అంతర్జాతీయ ముడి చమురు ధరలు,  విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌ఐఐల) పెట్టుబడులు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. గత కొన్ని సెషన్లుగా ఎఫ్‌‌ఐఐలు కొనుగోలు జరుపుతున్నారు. శుక్రవారం నికరంగా రూ.4,859 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.  దీంతో పాటు  దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ, రుతుపవనాల గమనాన్ని కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించనున్నారు. 

కాగా, మొహర్రం పండగ సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు ఉండటంతో ఇది కేవలం నాలుగు రోజుల ట్రేడింగ్ వారమే కానుంది.  టారిఫ్‌‌ల ప్రభావం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. వంటి రెండు పెద్ద ప్రతికూలతలు ఇప్పుడు క్రమంగా తొలగిపోతున్నాయని, దీంతో మార్కెట్ పెరుగుతోందని  జియోజిత్ ఇన్వెస్ట్‌‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.  

గత వారంలో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం కారణంగా బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 1,274.95 పాయింట్లు (1.68శాతం) లాభపడింది. ఈ వారం మార్కెట్లో కొంతవరకు 'వేచి చూసే ధోరణి'  వ్యూహం కొనసాగే అవకాశం ఉంది.