- ఆదుకోని టెస్కాబ్.. చేతులెత్తేసిన డీసీసీబీలు
- నిధుల లేమి, పెరిగిన వడ్డీ భారమే కారణం
- పాలకవర్గాలు లేక పట్టించుకోని సర్కార్
నల్గొండ, వెలుగు: వానాకాలం సీజన్ ప్రారంభమై పంటలు చేతికి వచ్చే సమయం దగ్గరపడుతున్నా నల్గొండ ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకుల్లో రైతులకు క్రాప్ లోన్లు అందడం లేదు. టెస్కాబ్ నుంచి డీసీసీబీలకు నిధుల కేటాయింపులు నిలిచిపోవడంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాలకవర్గాలు లేకపోవడం, అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో సహకార రుణ వ్యవస్థ పూర్తిగా పడకేసింది.
పెరిగిన వడ్డీ భారం...
సాధారణంగా నాబార్డ్ నుంచి టెస్కాబ్‌కు, అక్కడి నుంచి డీసీసీబీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలు అందుతాయి. నిబంధనల ప్రకారం రైతులకు 7 శాతం లోపే వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం టెస్కాబ్ వద్ద సొంత నిధులు లేకపోవడంతో నాబార్డ్ రీఫైనాన్స్ పై ఆధారపడాల్సి వస్తోంది.
దీంతో చివరికి రైతు వద్దకు వచ్చేసరికి వడ్డీ రేటు 8 శాతానికి పైగా దాటుతోంది. 7 శాతానికి మించి వడ్డీ భారం పడకూడదనే నిబంధన ఉండటం, అదనపు భారాన్ని భరించేందుకు నిధులు లేకపోవడంతో టెస్కాబ్ క్రాప్ లోన్ల కేటాయింపులను నిలిపివేసింది.
సొంత నిధులు లేక చేతులెత్తేసి..
డీసీసీబీలు, టెస్కాబ్ వద్ద సొంత నిధులు పుష్కలంగా ఉంటే, కొంత మార్జిన్ చూసుకొని రైతులకు 7 శాతానికే రుణాలు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ జిల్లాల్లోని డీసీసీబీలలో నిధుల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని బ్యాంకుల వద్ద కాస్తో, కూస్తో నిధులు ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాల రైతులకు సమంగా పంచలేక, వివాదాలు ఎందుకని అసలు రుణాల పంపిణీనే పక్కన పెట్టేశారు.
కలెక్టర్, సీఈవోల నేతృత్వంలో బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడంలేదు.
గతేడాది రికార్డ్ స్థాయీలో రుణాలు...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీసీసీబీ పరిధి లో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి. రైతులకు రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వడంతో పాటు రికవరీ కూడా అంతే వేగంగా చేస్తూ వాణిజ్య బ్యాంకుల కంటే అధికంగా రుణాలు మంజూరు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.328.35కోట్ల నుంచి రూ.623. 91కోట్లకు క్రాప్ లోన్లు పెరిగి అదనంగా రూ.295.56 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు.
కొన్నేండ్ల కింద రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ స్థానం చివరి నుంచి రెండోదిగా ఉండగా, గత ఆర్దిక సంవత్సరం రెండో స్థానానికి చేరింది. దీంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్రంతో పాటు ఆర్‌బీఐ వద్ద గుర్తింపు లభించింది. గత ఆర్థిక సంవత్సరం సైతం దాదాపు రూ.3 వేల కోట్లకు టర్నోవర్ చేరింది.
ప్రస్తుతం వడ్డీ భారంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టాల్సిన ఆడిట్ చేయకపోవడంతో ఆర్బీఐ నుంచి సైతం రుణాలు మంజూరు చేసేందుకు అనుమతులు రాకపోవడంతో రైతులకు అందించాల్సిన రుణాలను మంజూరు చేయడం లేదని డీసీసీబీ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
పాలకవర్గాలు లేక..
ప్రస్తుతం సహకార సంఘాలు, డీసీసీబీలకు ఎన్నికలు జరగక పాలకవర్గాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపంగా మారింది. ప్రజాప్రతినిధులు, చైర్మన్ ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తెప్పించేవారు. అధికారులు మాత్రం ఈ సమస్యను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
సర్కార్ కూడా ఈ విషయంలో ఎలాంటి చొరవ చూపకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టెస్కాబ్, డీసీసీబీల ద్వారా క్రాప్ లోన్లు విడుదల అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
