వెలుగు స్పెషల్ : వికారాబాద్ అడవుల్లో పర్యావరణ విధ్వంసం

వెలుగు స్పెషల్ :  వికారాబాద్ అడవుల్లో పర్యావరణ విధ్వంసం

హైదరాబాద్‌‌‌‌కు వంద కిలోమీటర్లలోపు దూరంలో భారతదేశంలోనే  ప్రత్యేకమైన ఒక భూభాగం ఉంది.  ఆ ప్రాంతం మూడు నదులకు జన్మనిచ్చింది.  మూసీ, మంజీర, కాగ్నా నదులు వికారాబాద్ కొండల నుంచే పుట్టాయి.  

సముద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో,  భూభాగం లోపలి భాగంలో ఉన్న ఒక త్రిపరీవాహక ప్రాంతం. సాధారణ సూత్రాల ప్రకారం సముద్రానికి దూరంగా ఉండే ఈ ప్రాంతం పొడిగా ఉండాలి. కానీ అలా లేదు. రాష్ట్రంలోని తడి ప్రాంతాలతో పోటీపడేలా ఇక్కడ వర్షపాతం నమోదవుతుంది.  

ఒకప్పుడు బ్రిటిష్ వారిని అనంతగిరిలో క్షయవ్యాధి శానిటోరియం నిర్మించేలా ఆకర్షించింది. ఈ భూభాగపు గాలి, ఎత్తు ఒకప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఎంతగా విశ్వసనీయమైనదో చెప్పే ఒక నిశ్శబ్ద చారిత్రక సూచిక అది.  ఇదంతా కేవలం భౌగోళిక యాదృచ్ఛికం కాదు. ప్రకృతిలో ఆకృతి వల్ల జరిగే పరిణామం. అనంతగిరి, దాని చుట్టూ ఉన్న వికారాబాద్ కొండలు దాదాపు 700 నుంచి 1,150 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.  

చుట్టూ ఉన్న పీఠభూమి కంటే చల్లగా, తేమగా ఉండేంత ఎత్తు అది. ఆ ఎత్తు, ఇప్పటికీ అటవీ కప్పు ఉన్న పీఠభూమి ఉపరితలం కలిసి, ఈ భూభాగాన్ని హైదరాబాద్‌‌‌‌కు పశ్చిమ దిశగా ఉన్న పర్యావరణ నీటి గోపురం (వాటర్ టవర్)గా పనిచేసేలా చేస్తున్నాయి. 

ఇది హిమానీనదాల కరగడం నుంచో,  రుతుపవనాలు తడిపే శిఖరాల నుంచో వచ్చేది కాదు.  జల ధారలను పుట్టించే, దానికింద ఉన్న భూగర్భ జలాలను సుస్థిరపరిచే, మూసీకి నీరందించే, స్థానిక వాతావరణాన్ని నియంత్రించే, హైదరాబాద్‌‌‌‌కు దగ్గరగా ఉండే ఒక అటవీ పీఠభూమి. 

జలశాస్త్రపరంగా, అనంతగిరి, -వికారాబాద్ ఎత్తయిన ప్రాంతాలు కేవలం ఒక్క నదికి పరీవాహక ప్రాంతం మాత్రమే కాదు. అవి పశ్చిమ తెలంగాణ పీఠభూమిలో ఒక ప్రాంతీయ పరీవాహక విభజన రేఖ (వాటర్‌‌‌‌షెడ్ డివైడ్)గా పనిచేస్తాయి.   భౌగోళికంగా ఇది పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, సాత్పురా, అరావళి పర్వత శ్రేణుల మాదిరిగా ఒక పర్వత శ్రేణి కాదు. 

వికారాబాద్ ఏ ప్రధాన నిరంతర పర్వతశ్రేణికీ చెందదు.  దీనికిదే ప్రత్యేకం.  విశాలమైన దక్కన్ ఎత్తయిన ప్రాంతాలలో, అటవీ కప్పు ఉన్న కొండ ద్రవ్యరాశులుగా, గట్లుగా, లోయలుగా, నిటారుగా ఉన్న అంచులుగా పైకి లేచిన ఒక గ్రానైట్ పీఠభూమి. దీన్ని ఇప్పటివరకు  నిజమైన పర్యావరణ ఆస్తిగా ఏ ప్రభుత్వమూ చూడలేదు. 

 ఒక పర్వత శ్రేణి చేసే జలశాస్త్ర పనిని నిశ్శబ్దంగా చేసే ఒక అటవీ గ్రానైట్ పీఠభూమి. నిజానికి వికారాబాద్ అటవీ ప్రాంతానికి సొంతంగా ఒక అటవీ డివిజన్ (వికరాబాద్ ఫారెస్ట్ డివిజన్) ఉంది. ఇది తెలంగాణ అటవీ శాఖలోని  చార్మినార్ ఫారెస్ట్ సర్కిల్ పరిధిలో  పనిచేస్తోంది. ఈ అటవీ పాలన వ్యవస్థలో లేనిదల్లా అటవీశాఖలో ఎలాంటి ప్రత్యేక గుర్తింపూ లేకపోవడం.

వికారాబాద్‌‌‌‌లో 16,962 హెక్టార్ల అటవీ విస్తీర్ణం

2015 తెలంగాణ అటవీ స్థితి నివేదిక ప్రకారం... మొత్తం 75,888 హెక్టార్ల రంగారెడ్డి జిల్లా అటవీ విస్తీర్ణంలో వికారాబాద్‌‌‌‌లో 16,962 హెక్టార్ల అటవీ విస్తీర్ణం నమోదైంది.  అంటే మొత్తం అడవిలో ఆనాడు దాదాపు నాలుగో వంతు ఒక్క వికారాబాద్‌‌‌‌లోనే ఉంది.  అత్యంత దట్టమైన అడవి (వెరీ డెన్స్ ఫారెస్ట్) కేటగిరీలో మొత్తం విస్తీర్ణం 11,069 హెక్టార్లలో 1,977 హెక్టార్లు,  మధ్యస్థ దట్టమైన అడవి (మోడరేట్‌‌‌‌గా డెన్స్ ఫారెస్ట్) కేటగిరీలో మొత్తం 18,178 హెక్టార్లలో 4,581 హెక్టార్లు వికారాబాద్‌‌‌‌లోనే ఉన్నాయి. 

అత్యంత దట్టమైన అడవిలో దాదాపు అయిదో వంతు, మధ్యస్థ దట్టమైన అడవిలో దాదాపు నాలుగో వంతు ఒకే ప్రాంతంలో  కేంద్రీకృతమై ఉన్నాయి. ఇంతటి విశిష్టత గల అడవిని అటవీ శాఖ నిర్లక్ష్యం చేయడం దాని వ్యవస్థలోనే  స్పష్టంగా కనపడుతుంది. దీనికి ఒక డివిజన్ ఉంది కానీ ప్రత్యేక గుర్తింపు లేదు. 

 నల్లమలకు  టైగర్ రిజర్వు హోదా ఉంది.  ఆదిలాబాద్ అడవులకు వాటి సొంత విశిష్ట  పర్యావరణ గుర్తింపు ఉంది.  దట్టమైన,  అత్యంత దట్టమైన అడవుల సమాన స్థాయి సాంద్రతను కలిగి,  రాష్ట్రంలో  మరెక్కడా లేని త్రి-నదీమూల ప్రాంతంగా ఉన్న వికారాబాద్‌‌‌‌కు మాత్రం అలాంటి సమాన హోదా ఏదీ లేదు.  అభయారణ్యం లేదు, బయోస్ఫియర్ హోదా లేదు. ఇక్కడ జీవవైవిధ్యం నమోదు చేసే ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థ లేదు. 

3 హెక్టార్లకు పడిపోయిన దట్టమైన అడవి

2023 భారత అటవీ స్థితి నివేదిక ప్రకారం, వికారాబాద్ అటవీ డివిజన్‌‌‌‌లో అత్యంత దట్టమైన అడవి కేవలం 3 హెక్టార్లు (0.03 చదరపు కిలోమీటర్లు) మాత్రమే మిగిలింది - అంటే దాదాపు శూన్యం. 2015లో 1,977 హెక్టార్లు నుంచి 2023 నాటికి కేవలం 3 హెక్టార్లకు పడిపోయింది. 

దీనికి విరుద్ధంగా మధ్యస్థ దట్టమైన అడవి 10,542 హెక్టార్లు (105.42 చదరపు కిలోమీటర్లు).  మొత్తం అటవీ విస్తీర్ణం 36,825 చదరపు కిలోమీటర్లుగా నమోదైంది. ఇందులో 65.64 చదరపు కిలోమీటర్ల క్షీణించిన పొదలు (స్క్రబ్) ప్రాంతం కలపలేదు. సూటిగా చెప్పాలంటే, వికారాబాద్ ప్రాంత అడవిలో ఎక్కువ భాగం అత్యంత బలహీనస్థితిలో ఉంది. 

నిజమైన, దట్టమైన  పరిపక్వమైన అడవిని నిర్వచించే కేటగిరీలో దాదాపు ఏమీ మిగలలేదు. 2015, 2023 నివేదికలు వేర్వేరు అయినా అటవీశాఖ సొంత పరిభాషలోనే చూసినా, ఒకప్పుడు రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన దట్టమైన అటవీ విస్తీర్ణాలలో ఒకదానికి కేంద్రంగా ఉన్న వికారాబాద్‌‌‌‌లో  ప్రభుత్వం సొంతంగా చేసిన అత్యంత తాజా అంచనా ప్రకారమే అత్యంత దట్టమైన అడవీ మిగలలేదు.  అత్యవసర పరిస్థితిగా చూడటానికి ఇదొక్కటి చాలు. 

అగ్నిప్రమాదాలతో అటవీ క్షీణత

 అటవీ అగ్నిప్రమాదాల రికార్డు కూడా ఈ ప్రాంత అటవీ క్షీణత, నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టం చేస్తున్నది చెబుతుంది.  ఈ దశాబ్దంలో మొత్తం 1,540 సంఘటనలు నమోదయ్యాయి. దామగుండం వద్ద, అనంతగిరి కొండల్లో, మూసీకి నీరందించే అదే పరీవాహక ప్రాంతంలో  అటవీ ప్రాంతం అన్యాక్రాంతం అవుతున్నది.   

మూసీనది అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామి ఆలయం పక్కనే జన్మించిందని చెబుతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఒక పరిరక్షణ మండలిని గీస్తే,  మూసీ జల ధారలను,  దామగుండం రిజర్వు అడవిని, కొటేపల్లి రిజర్వాయర్ పరీవాహక ప్రాంతాన్ని, తవ్వకాలు, పరిశ్రమలు, రక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి చాలావరకు కీలక ఆవాసాన్ని ఒకే దెబ్బతో పరిరక్షించవచ్చు. 

తెలంగాణలో ఇప్పటివరకూ గీయని సరిహద్దు సరిగ్గా ఇదే.  దీన్ని ప్రకటించడానికి కొత్తగా  శాస్త్రీయ ఆధారాలు కూడా అవసరం లేదు.  భౌగోళిక, జలశాస్త్ర వాస్తవాలే దీన్ని సమర్థిస్తున్నాయి.  దీన్ని గెజిట్ చేయడానికి కావలసింది కేవలం రాజకీయ సంకల్పం మాత్రమే. 
 
అటవీ హక్కుల చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు కావాలి

దామగుండం నౌకాదళ రాడార్ కేంద్రం, బుల్లెట్ రైలు కారిడార్, హైదరాబాద్–-వికారాబాద్ రహదారి విస్తరణ, అనంతగిరి చుట్టూ పర్యాటక, రిసార్ట్ విస్తరణ, లగచర్ల పారిశ్రామిక కారిడార్,  కొడంగల్ వృద్ధి కారిడార్, రాకంచెర్ల పారిశ్రామిక పార్క్.. వాటి వలన జరిగే విడివిడిగా, ఉమ్మడి దుష్ప్రభావం గురించిన చర్చ, అధ్యయనం, స్పందన లేనే లేదు.  

అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఏ), వన్యప్రాణి సంరక్షణ చట్టం ( డబ్ల్యూఎల్‌‌‌‌ఏ) ఇక్కడ కూడా,  మిగతాచోట్ల మాదిరిగానే,  కేవలం కాగితాలపై చట్టాలుగా  మిగిలిపోయాయి.  మూడు నదులకు  జన్మనిచ్చే ఒక  ప్రాథమిక అడవిలో, వాటి అమలు దాదాపు శూన్యం.  అనంతగిరిలో ఇప్పటికే ఉన్న అటవీ డివిజన్‌‌‌‌కు, రాష్ట్రం సొంతంగా 2015లో నమోదు చేసిన గణాంకాలకు తగినట్టుగా ఒక ప్రత్యేక పరిరక్షణ బాధ్యత అప్పజెప్పాలి.  ప్రతి అటవీ భూమి మళ్లింపు గురించి నిరంతరం అప్‌‌‌‌డేట్ అయ్యే బహిరంగ రికార్డు ప్రజల ముందు పెట్టాలి.  అటవీ హక్కుల చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం నిజంగా అమలు కావాలి. 

ఈ పరీవాహక ప్రాంతాన్ని తాకే ప్రతి రహదారి,  రైలు, తవ్వకం, రక్షణ, పారిశ్రామిక ప్రాజెక్టుకు నిర్మాణం మొదలుపెట్టిన తరువాత కాదు, అనుమతి ఇచ్చేముందే నిజమైన, బహిరంగంగా వెల్లడించే పర్యావరణ ప్రభావ మదింపు అవసరం. ఈ ప్రాజెక్టులన్నింటిని  స్థానిక ప్రజలను అభివృద్ధి నమూనాలలో ప్రయోజన భాగస్వాములను చేయాలి.   

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.