కులాధిపత్యాన్ని తొలగించేందుకే కుల సర్వే

కులాధిపత్యాన్ని తొలగించేందుకే కుల సర్వే
  •     ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ కంచ ఐలయ్య షెఫర్డ్ 

పంజాగుట్ట, వెలుగు: రాజకీయాల్లో కుటుంబ పాలన, కులాధిపత్యాన్ని తొలగించేందుకే కుల సర్వే నిర్వహించినట్లు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ తెలిపారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ పాలన, కులాధిపత్యం, స్త్రీ-పురుష అసమానతలు తగ్గించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ కుల సర్వేకు నాంది పలికారని పేర్కొన్నారు.
 

తెలంగాణలో వెలమ, రెడ్లు అధికారం చెలాయిస్తున్నారని, ఆ కులాల వారినే వివిధ రంగాల్లో నియమించడం పరిపాటిగా మారిందన్నారు. ఒకరు అవినీతికి పాల్పడితే, దాన్ని విచారించే అధికారి కూడా అదే కులానికి చెందిన వ్యక్తైతే.. చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కుల సర్వేతో యువత తమ తమ కులాల సంఖ్యాబలం తెలుసుకోవడం ద్వారా రాజకీయ చైతన్యం పెరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్​ చైతన్య వేదిక నాయకులు శివ ముదిరాజ్​, రాము ముదిరాజ్​, అల్లదుర్గం సురేశ్, కూరగాయల మధు, శ్రీనివాస్​ ముదిరాజ్​ తదితరులు పాల్గొన్నారు.