- మైనార్టీ స్టూడెంట్స్ మాత్రమే అర్హులు
- మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇలియాస్ అహ్మద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే మైనారిటీ స్టూడెంట్స్ నుంచి సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్/ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు.
అమెరికా, ఆస్ట్రేలియా, యూకే , కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, సింగపూర్ తదితర దేశాల్లోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో స్ప్రింగ్–2026 ఇన్‌టేక్ కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన ముస్లిం, సిక్కు, క్రైస్తవ, జైన, బౌద్ధ, పార్సీ మైనారిటీ స్టూడెంట్స్ ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
2026 జనవరి 1 నుంచి జూన్ 30 మధ్య కాలంలో అడ్మిషన్ పొందిన వారు అర్హులన్నారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఒక వైపు విమాన ప్రయాణ చార్జీలు అందజేస్తారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదని, నిర్దేశించిన అన్ని అర్హతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. దరఖాస్తుల కోసం తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్ జూన్ 1, 2026 నుంచి జూన్ 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
తప్పుడు పత్రాలు సమర్పించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆఫీసు హైదరాబాద్ లేదా ఫోన్ నెం. 040-23240134ను సంప్రదించవచ్చన్నారు. అవసరమైన పత్రాలతో హార్డ్ కాపీల సమర్పణకు చివరి తేదీ జూలై 31, 2026 అని తెలిపారు
