- పలు చోట్ల కప్పతల్లి ఆటలు
జగిత్యాల రూరల్/కొడిమ్యాల/సుల్తానాబాద్/బోయినిపల్లి/హుజురాబాద్ రూరల్, వెలుగు: ఎల్ నిలో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమృద్ధిగా వర్షాలు కురవాలని ఉమ్మడి కరీంనగర్జిల్లాలో పలు చోట్ల సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ లో ఆదివారం గ్రామస్తులు కలిసి కప్పతల్లి ఆటలు ఆడారు. వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామ వీధుల్లో కప్పతల్లి ఆటలతో ఊరేగింపు చేపట్టారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయపేటలో యువకులు, రైతులు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ కప్పతల్లి ఆట ఆడారు.
వర్షాలు కురవాలని శివుడికి జలాభిషేకం
సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని గుడి మిట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివుడికి ప్రజలు అభిషేకం చేశారు. గుడి మిట్టపల్లికి చెందిన 100 మంది మహిళలు నీటి బిందెలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. స్వామివారికి, నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి జలాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో వరుణయాగం చేశారు. కప్పతల్లి ఆట ఆడుతూ స్వామివారికి జలాభిషేకం చేశారు. వరుణ దేవుడి కటాక్షం కోసం హుజురాబాద్ మండలం కందుగులలో గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
