- ఓట్ల తొలగింపుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్
- 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన మహనీయుడు మోదీ అని కామెంట్
కరీంనగర్, వెలుగు: తెలంగాణలోనూ నిజమైన పౌరుల ఓట్లను తొలగించే అవకాశమే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముస్లింలుసహా ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బంగ్లా, పాకిస్తాన్ నుంచి బెంగాల్‌కు అక్రమంగా వలస వచ్చిన ముస్లిం ఓట్లను తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏండ్ల పాలనను పురస్కరించుకొని కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ‘మేధావుల సదస్సు’లో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ పాలనలో అక్రమ చొరబాట్లపై ఉక్కుపాదం మోపారన్నారు. దేశంలోకి వచ్చిన రోహింగ్యాలు, అక్రమ చొరబాటుదారులంతా 2014కు ముందు వలస వచ్చిన వాళ్లేనని తెలిపారు.
బెంగాల్‌లో ఆ ఓట్లను మాత్రమే తొలగించామని, అక్కడ రిగ్గింగ్‌కు తావు లేకుండా పోలింగ్ జరిగిందని గుర్తు చేశారు. ప్రజా తీర్పుతోనే అక్కడ బీజేపీ పాలన వచ్చిందని తెలిపారు. 12 ఏండ్ల పాలనలో ఒక్క అవినీతికి తావులేకుండా సుస్థిర పాలనతో భారత్‌ను అగ్ర రాజ్యాల సరసన చేర్చి.. దేశ గతినే మార్చేశారని అన్నారు. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన మహనీయుడు మోదీ అని కొనియాడారు. వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తోందని, వాస్తవానికి ప్రతి గింజను కేంద్రమే కొంటూ రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోందని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల మేరకే కేంద్రం కొనుగోళ్లు జరుపుతుందని, సరైన ప్రతిపాదనలు పంపకుండా కేంద్రంపై నెపం నెట్టడం దుర్మార్గమని విమర్శించారు.
భారత్ యోగ భూమి
భారతదేశానికి ‘యోగ భూమి’గా ప్రపంచ దేశాలన్నీ గుర్తింపు ఇచ్చాయని బండి సంజయ్ తెలిపారు. నేడు ప్రపంచమంతా ఒత్తిడి, ఆందోళనతోపాటు జీవన శైలి వ్యాధులతో బాధపడుతున్నదని, వీటికి సరైన పరిష్కారం నిత్యం యోగా చేయడమేనని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లో నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిరోజూ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. . ప్రధాని మోదీ యోగాను ప్రపంచ శ్రేయస్సుతో అనుసంధానం చేశారని కొనియాడారు.
