- హార్మూజ్ జల సంధి తెరుచుకున్నా రష్యన్ ఆయిల్‌ను పెద్ద మొత్తంలో కొంటున్న ఇండియా
- యూఏఈ నుంచి నిలకడగా కొనసాగుతున్న సప్లయ్
- అమెరికా నుంచి భారీగా పడిపోయిన ఆయిల్ దిగుమతులు
న్యూఢిల్లీ: హార్మూజ్ జల సంధి తిరిగి తెరుచుకున్నా భారత రిఫైనరీలు మాత్రం రష్యా ఆయిల్ కొనడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఈ దేశంతో లాంగ్‌టర్మ్ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. మరోవైపు యూఏఈ నుంచి నిలకడగా ఆయిల్ సప్లయ్ జరుగుతోంది. అమెరికా నుంచి మాత్రం ఇంధన దిగుమతులు భారీగా పడిపోయాయి.
మార్కెట్ అనలిటిక్స్ సంస్థ క్లెపర్ ప్రకారం,
రష్యా నంబర్ వన్: ఈ నెల19 నాటికి రష్యా నుంచి భారత్ సగటున రోజుకు 26.6 లక్షల (2.66 మిలియన్) బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. మే నెలలో ఇది 19.1 లక్షల బ్యారెళ్లుగా ఉండగా.. ఈసారి ఏకంగా 40శాతం జంప్ అయింది. జూన్ మొత్తం నెలకు గానూ ఇది రికార్డు స్థాయిలో 23.5 లక్షల బ్యారెళ్లకు చేరుకోనుంది. ఇది రష్యా నుంచి వచ్చే ఆయిల్ ఏడాది సగటు కంటే చాలా ఎక్కువ.
యూఏఈ : యూఏఈ నుంచి రోజుకు 6,36,000 బ్యారెళ్ల సరఫరా జరిగింది. మే నెలలో ఇది రికార్డు స్థాయిలో 6,44,000 బ్యారెళ్లుగా ఉంది. హార్మూజ్ జలమార్గాన్ని దాటకుండా నేరుగా సముద్ర తీరానికి చేరే పైప్‌లైన్ హబ్షన్ ఫుజైరహ్‌ను వాడుకొని యూఏఈ తన ఆయిల్‌ను ఇండియాకు సప్లయ్ చేస్తోంది.
మిగిలిన దేశాలు: సౌదీ అరేబియా 3,84,000 బ్యారెళ్లతో మూడో స్థానంలో ఉండగా.. భారీ డిస్కౌంట్ ఇస్తున్న వెనిజువెలా 2,09,000 బ్యారెళ్లతో నాలుగో అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది. అమెరికా నుంచి దిగుమతులు మాత్రం మే నెలలోని 2,52,000 బ్యారెళ్ల నుంచి జూన్‌లో 91,000 బ్యారెళ్లకు భారీగా పడిపోయాయి.
గల్ఫ్ నుంచి ఇప్పట్లో కొనం
ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో అమెరికా–-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ జల సంధిని మూసివేసింది. ప్రపంచ చమురు సరఫరాకు పెద్ద బ్రేక్ పడింది. ఇక్కడి నుంచే ప్రపంచ చమురు వినియోగంలో 20శాతం, భారత్ దిగుమతి చేసుకునే సగానికి పైగా ఇంధనం రవాణా అవుతుంది. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందంతో శనివారం భారత్‌కు చెందిన మూడు పెద్ద ఆయిల్ ట్యాంకర్లు (దేశ్ వైభవ్, దేశ్ విభోర్, సన్మార్ హెరాల్డ్) సుమారు 8.6 లక్షల టన్నుల చమురుతో ఈ జలమార్గాన్ని సురక్షితంగా దాటాయి.
‘‘హార్మూజ్ మూసివేత వల్ల భారతదేశంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ మాత్రమే. కాబట్టి ఈ మార్గం తెరుచుకున్న వెంటనే మొదటగా ఎల్‌పీజీ సరఫరా వేగంగా సాధారణ స్థితికి వస్తుంది”అని క్లెపర్ సీనియర్ మేనేజర్ సుమిత్ రిటోలియా అభిప్రాయపడ్డారు.
ముడి చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) దిగుమతులకు భారత్ ఇప్పటికే రష్యా, వెనిజువెలా, బ్రెజిల్ వంటి దేశాల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పరచుకుందని, కాబట్టి గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ దిగుమతులు తిరిగి పాత స్థాయికి చేరడానికి మరికొన్ని వారాలు లేదా నెలల సమయం పట్టొచ్చని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, షిప్పింగ్ సంస్థలకు ఈ మార్గంపై నమ్మకం కుదరాల్సి ఉందన్నారు.
