యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  •  దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు.. గవర్నర్  శివప్రతాప్ శుక్లా, స్పెషల్ సీఎస్ దాన కిశోర్, అధికారులు, సిబ్బందితో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడారు.  

మానసిక ఒత్తిళ్లు, వేగవంతమైన జీవనశైలితో కూడిన ప్రస్తుత కాలంలో యోగా ప్రతి ఒక్కరికీ అంతర్గత ప్రశాంతత, క్రమశిక్షణ, సానుకూల శక్తిని అందిస్తుందని తెలిపారు. యోగా భారతీయ సనాతన జ్ఞాన సంపదకు ప్రతీకగా నిలిచి,  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య చైతన్యానికి మార్గదర్శకంగా మారిందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని గవర్నర్ కొనియాడారు.  భారతీయుల ప్రాచీన వారసత్వమైన యోగా నేడు ప్రపంచానికి ఆరోగ్యం, మానసిక సమతుల్యత సందేశాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.    

తిరుచనూర్ పద్మావతి ఆలయంలో పూజలు

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన భార్య జానకి శుక్లా, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుచనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేశారు. గవర్నర్ ఆలయ విశిష్టతను కొనియాడుతూ, భారతీయ సంప్రదాయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని వెల్లడించారు.