- రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం మోపడం అన్యాయం
- ఉపాధి హామీ నుంచి ‘గాంధీజీ’ పేరు తొలగింపుపై నిరసన
- 60 రోజుల పని విరామం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు
- ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలతో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ చట్టం–2025పై రాష్ట్ర ప్రభుత్వం పోరుకు రెడీ అయ్యింది. ఈ చట్టం వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం కుంటుపడుతుందని, రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని కేబినెట్ సబ్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన సబ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పథకం నిధుల్లో 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అప్రజాస్వామికమని పేర్కొంది. ఆర్టికల్ 258(3) ప్రకారం.. రాష్ట్రాలపై కేంద్రం అదనపు భారం మోపే పక్షంలో రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని కేంద్రం భరించాల్సి ఉంటుందని సభ్యులు తెలిపారు. 16వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు రాష్ట్రాల ఆర్థిక హక్కులు హరించేలా, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలకు నష్టం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి వెళ్తే.. తిరిగి వచ్చేది 40 పైసలేనని, ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా 40 శాతం భారం మోపడం ఆమోదయోగ్యం కాదని కమిటీ స్పష్టం చేసింది.
ఉపాధి విరామం సాధ్యం కాదు
కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామం క్షేత్రస్థాయిలో సాధ్యం కాదని కమిటీ తేల్చిచెప్పింది. దీనివల్ల కూలీలకు ఉపాధి తగ్గి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రాత్మకమైన ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్‌ను మరోసారి వినిపించింది. ఈ చట్టాన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సబ్ కమిటీ సిద్ధమవుతోంది. రాజ్యాంగపరంగా సవాల్ చేసే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
ఈ విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. వీబీజీ రామ్‌జీ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోపాటు తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ వంటి విపక్ష పాలిత రాష్ట్రాలతో కలిసి ఉమ్మడిగా నిరసనను వ్యక్తం చేయాలని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులు అందించేందుకు అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
గ్రామీణ సంక్షేమం, ఉపాధి భద్రత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని తుది నివేదిక రూపొందించనున్నట్లు వెల్లడించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తుది నివేదికను రూపొందించనున్నట్లు కమిటీ తెలిపింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
