బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకూ పోరాడుతా: కవిత

బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకూ పోరాడుతా: కవిత

హైదరాబాద్: సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం సంకల్పం తీసుకుంటున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ప్రకటించారు. గురువారం (ఆగస్ట్ 6) హైదరాబాద్‎లోని సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సంకల్ప సభ నిర్వహించారు. టీఆర్ఎస్ చీఫ్ కవిత ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సామాజిక న్యాయ సంకల్ప సభ కొట్లాది మంది జీవితాలను మార్చబోతోందన్నారు. 

నేను బీసీల కోసం మాట్లాడితే అగ్రకులం అంటూ నన్ను కొందరు హేళన చేస్తారు. నా పుట్టుక నా చేతిలో లేదు. కానీ నేను ఎవరి కోసం పని చేయాలో నిర్ణయించుకోవడం మాత్రం నా చేతుల్లోనే ఉందన్నారు. అందుకోసమే.. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నానని అన్నారు. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకూ పోరాడుతానని ప్రకటించారు. 

బీసీ రిజర్వేషన్ల బిల్లును వచ్చే బడ్జెట్ సెషన్ లోపు పాస్ చేసి పంపించాలని.. లేదంటే వెయ్యి కార్లతో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. సామాజిక న్యాయం అంటే అగ్రకులాలు తమ సీట్లు పోతాయని అనుకుంటాయని.. కానీ ఈ దేశంలో వచ్చిన అనేక మార్పులకు అగ్రకులాల్లోని ప్రజాస్వామ్యవాదులే కారణమని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం కోసం కలిసి వచ్చే అందరిని కలుపుకుని పోరాటం చేద్దామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక మాట చెప్పారు. తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక తెలంగాణ ఉద్యమాన్ని ఒకేసారి చేయలేమన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత సామాజిక న్యాయం కోసం అంతే పవిత్రంగా మనం ఉద్యమాన్ని చేయాలని చెప్పారని తెలిపారు. ఆయన కన్నా కలలను నిజం చేసే విధంగా మనం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

సామాజిక సంకల్ప సభలో చేసిన తీర్మానాలు ఇవే:

1. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కలిసి వచ్చే వారితో దేశ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. 

2. మహత్మా జ్యోతిరావ్ పూలే దంపతులకు భారత రత్న అవార్డు ఇవ్వాలి. 

3. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని పెట్టాలి. 

4. ఎస్సీ, ఎస్టీల నిధులను వాళ్ల అభ్యున్నతి కోసమే వాడాలి. 

5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను నింపేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి. 

6. ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు రావాలి. 

7. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. 

8. ముస్లింలకు ఆర్థిక స్వావలంభనతో పాటు వక్ఫ్ బోర్డు చట్టం తేవాలి. 

9. సిక్కులు, క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంభన ఉండేలా చర్యలు తీసుకోవాలి. 

10. ట్రాన్స్ జండర్లకు సంపూర్ణ హక్కులు రావాలి. 

11. వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు పెంచాలి. వారికి కో ఆప్షన్ సభ్యుల్లో రిజర్వేషన్ కల్పించాలి.