డిసెంబర్‌‌ లోపు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్: ఇండియా-ఈయూ ఎఫ్‌‌టీఏపై పీయూష్ గోయల్‌‌

డిసెంబర్‌‌ లోపు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్: ఇండియా-ఈయూ ఎఫ్‌‌టీఏపై పీయూష్ గోయల్‌‌

న్యూఢిల్లీ:  భారతదేశం, 27 దేశాల యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య  ఫ్రీ ట్రేడ్  అగ్రిమెంట్ (ఎఫ్‌‌టీఏ) ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి–-మార్చి (2027) నాటికి ఇది అమలులోకి వస్తుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 27న ఇరుపక్షాల మధ్య చర్చలు ముగిశాయి. 

ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతుల్లో సుమారు 93 శాతం ఉత్పత్తులపై యూరోపియన్ మార్కెట్లో సుంకాలు పడవు.  అదే సమయంలో ఈయూ నుంచి వచ్చే లగ్జరీ కార్లు, వైన్ల ధరలు భారతదేశంలో తగ్గనున్నాయి. భారత్, ఈయూ దేశాలు కలిపి ప్రపంచ జీడీపీలో 25శాతం వాటాను, అంతర్జాతీయ వాణిజ్యంలో మూడో వంతు (దాదాపు 11 ట్రిలియన్ డాలర్లు) వాటాను కలిగి ఉన్నాయి. 

అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ క్రేజ్

అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌‌టీఆర్‌‌‌‌) జేమీసన్ గ్రీర్ కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చల కోసం ఈ వారంలోనే భారత్‌‌కు రానున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, కెనడా ప్రధాని సైతం భారత్‌‌తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని  ఈ ఏడాది లోపే పూర్తి చేయాలని చూస్తున్నారన్నారు.   "ప్రస్తుతం ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోంది" అని గోయల్‌‌ వ్యాఖ్యానించారు.

అడ్డంకులున్నా ఎగుమతులు జూమ్

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ ఇండియా ఎగుమతులు దూసుకుపోతున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూన్ 14 మధ్య కాలంలో  వస్తువుల ఎగుమతులు దాదాపు 15 శాతం వృద్ధి చెందాయని   పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్లతో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. ‘‘అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌‌ల (సుంకాలు) సవాళ్లను అధిగమించి 2025-–26లో భారత్ అద్భుతమైన ఎగుమతుల వృద్ధిని సాధించింది. 

ఆ జోరు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది”అని తెలిపారు.  జూన్ నెలకు సంబంధించిన పూర్తి అధికారిక డేటాను వాణిజ్య మంత్రిత్వ శాఖ జులై 15న విడుదల చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్–-మే కాలంలో మాత్రం ఎగుమతులు ఏడాది లెక్కన 16.09 శాతం పెరిగి 88.91 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 15.14శాతం పెరిగి 145.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో వాణిజ్య లోటు  56.44 బిలియన్ డాలర్లుగా ఉంది. మే నెలలో ఎగుమతులు ఆరు నెలల గరిష్ట స్థాయి అయిన 45.2 బిలియన్ డాలర్లకు చేరాయి.