- 24.28 లక్షల టన్నుల నుంచి 1.51 కోట్ల టన్నులకు చేరిన కొనుగోళ్లు
- ధాన్యం ఉత్పత్తి, సేకరణలో అగ్ర స్థానంలో తెలంగాణ
- 26 లక్షల మంది రైతులకు రూ.36 వేల కోట్లు చెల్లింపులు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం సేకరణ భారీగా పెరిగింది. గత 12 ఏండ్లలో పోలిస్తే ప్రస్తుతం ఆరు రెట్లు పెరిగి, నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. 2014–15లో వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి కేవలం 24.28 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరగగా, 2025–26 నాటికి రెండు సీజన్లు కలిపి 1.51 కోట్ల టన్నులకు చేరింది. అంటే 12 ఏండ్లలో ధాన్యం కొనుగోళ్లు దాదాపు ఆరు రెట్లు పెరిగాయి. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అధిగమించి వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు హామీ ఇవ్వడం, గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రవాణా సౌకర్యాల విస్తరణ వంటి చర్యలు సాగు పెరగడానికి కారణమయ్యాయి. 2025-–26 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి మొత్తం 2.95 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగగా, అందులో సగానికి పైగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించింది. ఈ కొనుగోళ్ల ద్వారా 26 లక్షల మందికి పైగా రైతులకు రూ.36 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు పంట విక్రయంలో నమ్మకం పెరిగిందని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి.
దేశ కొనుగోళ్లలో 61 శాతం తెలంగాణదే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ వాటా 61 శాతానికి చేరడం రాష్ట్ర వ్యవసాయ ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో యాసంగి సీజన్‌లో 25.03 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కాగా, తెలంగాణలో 75.85 లక్షల టన్నులకు పైగా సేకరించారు. అంటే ఏపీతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.
ధాన్యం సేకరణ పెరుగుదలకు కొనుగోలు కేంద్రాల విస్తరణ కీలక పాత్ర పోషించింది. 2025=-26 వానాకాలంలో 8,448 కేంద్రాలు, యాసంగిలో 8,575 కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సమీపంలోనే ధాన్యం విక్రయించే అవకాశం కల్పించారు. గత రెండేండ్లలోనే 3 వేలకుపైగా కొత్త కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు వ్యవస్థ మరింత బలోపేతమైంది. దేశంలో వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 4,850 కొనుగోలు కేంద్రాలే ఉండగా, తెలంగాణలో దాదాపు రెండింతలు అధికంగా కేంద్రాలు నిర్వహించడం విశేషం.
తెలంగాణ ఏర్పాటైన తొలి సంవత్సరాల్లో ధాన్యం సేకరణ 25 లక్షల టన్నుల లోపే ఉండేది. అనంతరం సాగు విస్తీర్ణం పెరగడం, సాగు నీటి లభ్యత మెరుగుపడటం, రైతులకు ప్రోత్సాహక చర్యలు అమలు కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. 2018-–19లో 77.41 లక్షల టన్నులు, 2019–-20లో 111.27 లక్షల టన్నులు, 2020–21లో 141.01 లక్షల టన్నుల వరకు సేకరణ చేరింది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు, సాగు విస్తీర్ణంలో మార్పుల కారణంగా కొంత హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, నిరంతర వృద్ధినే సూచిస్తోంది.
వరి సాగులోనూ రికార్డు..
2025-26 యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. అనుకూల వాతావరణం, సమృద్ధిగా నీటి లభ్యత, అధిక దిగుబడులు కారణంగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో కొనుగోళ్ల పరంగా కూడా కొత్త రికార్డులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 24.28 లక్షల టన్నులుగా ఉన్న ధాన్యం సేకరణ, నేడు 151.85 లక్షల టన్నులకు చేరడం తెలంగాణ వ్యవసాయ రంగంలో జరిగిన మార్పుకు అద్దం పడుతోంది.
ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను దాటి, వరి ఉత్పత్తిలో అదేవిధంగా ధాన్యం సేకరణలో దేశానికి మార్గదర్శక రాష్ట్రంగా తెలంగాణ ఎదగడం వ్యవసాయ రంగ చరిత్రలో మైలురాయిగా నిలిచింది
