- ఆంధ్ర నేతలు తెలంగాణపై ఆధిపత్యం చలాయిస్తామంటే ఎలా ?
- : ఎమ్మెల్సీ కోదండరాం
మహబూబాబాద్, వెలుగు : ఒకరిద్దరు కొట్లాడితే తెలంగాణ వచ్చిందనడం సరికాదు.. వివిధ సంఘాలు, సంస్థలు, నాయకుల సమష్టి పోరాటాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది' అని టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయం అన్నారు.
తెలంగాణ గడ్డపై పరాయి సాంస్కృతిక ఆధిపత్యాన్ని సహించేది లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది తెలంగాణలో నివరిస్తున్నారని, ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు తెలంగాణలో రాజకీయ ఆధిపత్యం కోసం రెచ్చగొట్టే విధానాలకు పాల్పడడం సరికాదన్నారు.
తెలంగాణలోనే ప్రెస్ మీట్లు పెడుతూ.. స్వేచ్ఛ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమానికి సంఘీభావం తెలిపిన ఆర్. నారాయణమూర్తిని ఈ ప్రాంత ప్రజలు గౌరవించడం లేదా అని ప్రశ్నించారు. ఉద్యమాలను, తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన వారికి ప్రజలు ఎలా ఆహ్వానం పలుకుతారన్నారు.
తెలంగాణలో సేవ చేయాలనుకుంటే అభ్యంతరం లేదని, రాజకీయ ఆధిపత్యానికి పాల్పడితే మాత్రం కుదరదని స్పష్టం చేశారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలంతా కలిసే ఉంటున్నారని, స్వార్థ ప్రయోజనాల వారిని రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు.
'సర్'పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, మైస శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్, ప్రవీణ్ రాజు, శంతన్‌రామరాజు, గుగ్గిల్ల పీరయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
