ఖమ్మం జిల్లా కుంచచపర్తిలో గుప్తనిధుల కలకలం.. శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా తవ్వకాలు

ఖమ్మం జిల్లా కుంచచపర్తిలో గుప్తనిధుల కలకలం.. శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా తవ్వకాలు

వేంసూరు, వెలుగు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా రహస్యంగా తవ్వకాలు జరగడంతో కలకలం రేగింది. గ్రామంలోని మారెమ్మతల్లి ఆలయం పక్కన 18 ఏళ్ల క్రితం భరద్వాజానంద స్వామీజీ విజయవాడ నుంచి వచ్చి శివాలయం నిర్మించి పూజలు నిర్వహిస్తున్నాడు. 

ఇటీవల ఆలయం వెనుక భాగంలో సుమారు 15 అడుగుల లోతు వరకు గుంత తవ్వించారు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు జరపడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తవ్వకాల్లో పాల్గొంటున్న 11 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. 

భరద్వాజానంద స్వామీజీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. గ్రామ శ్రేయస్సు కోసం 18 అడుగుల గుంత తవ్వి శ్రీచక్రం, కొన్ని యంత్రాలు ప్రతిష్ఠించాలనే ఉద్దేశ్యంతో తవ్వించామని స్వామీజీ చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై సత్తుపల్లి రూరల్​ సీఐ ముత్తు లింగయ్య విచారణ చేపట్టారు.