ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధం..కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద ఘటన

ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధం..కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద ఘటన
  •     బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్, ఎగిసి పడ్డ మంటలు
  •     ప్రయాణికులంతా ముందే దిగడంతో తప్పిన ప్రమాదం

తిమ్మాపూర్, వెలుగు : బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ముందుగా వాసన, పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ బస్సును పక్కన ఆపి ప్రయాణికులకు కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కరీంనగర్​జిల్లా అలుగునూర్​ గ్రామంలో ఆదివారం జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్​-2 డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఆదివారం ఉదయం 7 గంటలకు 42 మంది ప్రయాణికులను ఎక్కించుకొని హైదరాబాద్ కు బయలుదేరింది. 7.15 గంటల సమయంలో అలుగునూరు గ్రామ శివారులోని కాకతీయ కాల్వ వద్దకు రాగానే కాలిన వాసన వస్తుండడాన్ని గమనించిన డ్రైవర్ బోయిని ప్రశాంత్ బస్సును పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దించేశాడు.

 అనంతరం బ్యాటరీ బాక్స్ ను పరిశీలించగా... బ్యాటరీలు పేలి మంటలు అంటుకున్నాయి. డ్రైవర్​తో పాటు పలువురు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఫైర్​ డిపార్ట్​మెంట్​కు సమాచారం ఇచ్చారు. అప్పటికే మంటల తీవ్రత పెరిగి బస్సు మొత్తం వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

 డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రయాణికులను దించేయడం, ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వాహనాలను పక్క లేన్ గుండా పంపించడంతో కొద్దిసేపి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.

డ్రైవర్​కు అభినందనలు

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులను అలర్ట్ చేసి ప్రాణనష్టం జరగకుండా చూసిన డ్రైవర్​ప్రశాంత్​ను ఆఫీసర్లు అభినందించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఆఫీసర్లు ఆర్. వెంకన్న, పి.పోలమన్​, బి. రాజు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్​కు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని అందజేస్తామని ప్రకటించారు.