రామాయంపేట, వెలుగు : రామాయంపేట ఆస్పత్రి స్థాయి పెంపునకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని ఆరోగ్య వంత జీవనం సాగించాలని సూచించారు. ఆదివారం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశిర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించి, స్టాఫ్ వివరాలు, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్ల కొరతతో పాటు ఫర్నిచర్ కావాల్సి ఉందని సూపరింటెండెంట్ లింబాద్రి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎంపీ డెంటల్ చైర్ ను సత్వరమే ఇప్పిస్తానని చెప్పారు. త్వరలో ఆర్వో వాటర్ ప్లాంట్, సీ ఆర్మ్ మిషన్ ఏర్పాటుతో పాటు ఎన్ ఆర్ఈ జీ ఎస్ కింద కిచెన్ షెడ్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గైనకాలజిస్ట్ ను నియమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆస్పత్రిని 50 పడకలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. డయాలసిస్ సెంటర్ ను వాడుకలోకి తీసుకొచ్చి స్థానిక ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పట్టణ పాత హైవే విస్తరణతో పాటు అధ్యా హోటల్ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ డాక్టర్ శివదయాల్ తదితరులు ఉన్నారు.
