- భద్రాద్రి జిల్లాలో కారు చెట్టును ఢీకొని భార్యాభర్త, కొడుకు...
- సిద్దిపేట జిల్లాలో దంపతులు,
- వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి
ములకలపల్లి/పర్వతగిరి/కొండపాక, వెలుగు : పలు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి జిల్లా, వరంగల్ జిల్లాలో ముగ్గురు చొప్పున చనిపోగా, సిద్దిపేట జిల్లాలో దంపతులు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు.
భద్రాచలంలోని వేంకటేశ్వర కాలనీకి చెందిన దూడల సాయి ప్రకాశ్ (28), భార్య సంధ్య (25), కొడుకు మోక్షిత్(2), తల్లి జ్యోతి తో కలిసి ములకలపల్లిలోని బంధువుల ఇంటికి కారులో వచ్చారు. అక్కడి నుంచి తిరిగి భద్రాచలానికి కారులో వెళ్తుండగా... మాదారం, పూసుగూడెం మధ్యకు రాగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
ప్రమాదంలో సాయి ప్రకాశ్, అతడి భార్య సంధ్య, కొడుకు మోక్షిత్ అక్కడికక్కడే చనిపోగా, తల్లి జ్యోతికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకోని జ్యోతిని పాల్వంచ హాస్పిటల్ కు తరలించారు. ప్రకాశ్ తండ్రి ఆరు నెలల కిందే చనిపోగా.. ఇప్పుడు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ట్రాక్టర్ ఢీకొని దంపతులు
ట్రాక్టర్ నుంచి వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టడంతో భార్యాభర్త చనిపోయారు. ఈ ప్రమాదం ఆదివారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా దండుపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చందనగిరి మహేందర్ (29), అతడి భార్య దీక్షిత (25) హైదరాబాద్ లో ఉంటున్నారు.
ఆదివారం స్కూటీపై సొంత గ్రామమైన కొండాపూర్ వెళ్తున్నారు. మార్గమధ్యలో కుకునూరుపల్లి మండలం లకుడారం స్టేజీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టింది. ప్రమాదంలో మహేందర్ అక్కడికక్కడే చనిపోగా.. దీక్షిత తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు ఆమెను గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.
రెండు బైక్ లు ఢీకొని ముగ్గురు...
రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మోడల్స్కూల్ సమీపంలో ఆదివారం జరిగింది. పర్వతగిరికి చెందిన బుద్దె చరణ్ (16) వరంగల్ లోని ఓ జూనియర్కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో ఇటీవల ఇంటికి వచ్చాడు. రెండు రోజుల కింద హైదరాబాద్కు చెందిన ఇద్దరు స్నేహితులు బైక్ పై పర్వతగిరిలోని చరణ్ వద్దకు వచ్చారు.
ఆదివారం చరణ్మరో స్నేహితుడితో కలిసి బైక్ పై పర్వతగిరి వైపు వస్తున్నాడు. ఇదే సమయంలో తురుకలసోమారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఎల్లాగౌడ్(58), ఎండీ.అహ్మద్(58) స్కూటీపై గ్రామానికి వెళ్తున్నారు. పర్వతగిరిలోని మోడల్స్కూల్వద్దకు రాగానే రెండు టూవీలర్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే చనిపోగా, అహ్మద్, ఎల్లాగౌడ్ హాస్పిటల్ లో చనిపోయారు.
