పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు.. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తా: తెహెల్కా మాజీ ఎడిటర్

పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు.. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తా: తెహెల్కా మాజీ ఎడిటర్

న్యూఢిల్లీ: సహోద్యోగిపై లైంగిక వేధింపుల కేసులో తెహెల్కా మాజీ ఎడిటర్ తేజ్ పాల్‎కు బాంబే హైకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాంబే హైకోర్టు తీర్పుపై తేజ్ పాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసని అభివర్ణించారు. తాను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బాధితుడినని పేర్కొన్నారు. బాంబే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. 

బాంబే హైకోర్టు సాక్ష్యాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించడానికి మేం సమర్పించిన ఆధారాలు సరిపోతాయని పేర్కొన్నారు. తెహెల్కా వెలుగులోకి తెచ్చిన పలువురి అవినీతి బాగోతాలు, కుంభకోణాల కారణంగా రాజకీయ కక్షతో 13 ఏళ్లుగా నా వెంట పడుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఏడున్నర సంవత్సరాలు పోరాడి నిర్దోషులుగా విడుదలయ్యామని.. ఇప్పుడు మళ్లీ నా వెంట పడుతున్నారని అన్నారు. 

తేజ్‎పాల్‎కు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా

2013 నాటి సహోద్యోగిపై లైంగిక వేధింపుల కేసులో తెహెల్కా మాజీ ఎడిటర్ తేజ్ పాల్‎ను బాంబే హైకోర్టు దోషిగా తేలుస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2021లో తేజ్ పాల్‎ను నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో తేజ్ పాల్‎కు 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది. 2 వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. 

అసలేం జరిగిందంటే..? 

2013లో తెహెల్కా ఎడిటర్ తేజ్ పాల్ సింగ్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపిస్తూ ఆయన జూనియర్ జర్నలిస్టు పోలీసులను ఆశ్రయించింది. థింక్ ఫెస్ట్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో.. హోటల్ ఎలివేటర్ లోపల తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ కేసులో 2017లో మపుసా ట్రయల్ కోర్టులో విచారణ మొదలై.. 2021లో ఆయనను నిర్దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు తీర్పును గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‎పై బాంబే హైకోర్టు 2026, ఆగస్ట్ 6న సంచలన తీర్పు వెలువరించింది.