భారత స్టాక్ మార్కెట్లు ఉగాది ట్రేడింగ్ రోజున ఇన్వెస్టర్లకు అస్సలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిమిషం నిమిషానికీ నష్టాలు పెరిపోవటం ఆందోళనలు పెంచేస్తోంది. మార్కెట్ల ముగింపునకు ముందు 3 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 2700 పాయింట్ల మేర పతనం అయ్యింది. నిఫ్టీ కూడా 820 పాయింట్లకు పైగా పడిపోయింది. మిగిలిన బ్యాంక్, మిడ్ క్యాప్ సూచీలు కూడా 19వందల పాయింట్ల వరకూ కుప్పకూలాయి. అయితే మార్కెట్లను ఇంతగా పతనానికి దారితీయించిన కీలక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. మండిపోతున్న ముడిచమురు ధరలు:
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 8 శాతం పెరిగి బ్యారెల్‌కు 117 డాలర్లకు చేరింది. భారతదేశం తన అవసరాల కోసం చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు ధరలు 110 డాలర్ల పైన ఇలాగే కొనసాగితే.. అది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణమవుతుంది.
2. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు:
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం భారీ పతనంతో ముగిశాయి. దీని ప్రభావంతో ఆసియా మార్కెట్లయిన జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు కూడా భారీగా నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న ఈ నెగటివ్ సెంటిమెంట్ భారత ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది.
3. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు:
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) భారత మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే వీరు రూ.2వేల 714.35 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోకుండా తమ నిధులను ఉపసంహరించుకోవడం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీసింది.
4. పెరిగిన మార్కెట్ భయం - ఇండియా విక్స్:
మార్కెట్‌లో భయాన్ని కొలిచే ఇండియా విక్స్ ఏకంగా 24 శాతం పెరిగి 23.13 స్థాయికి చేరింది. విక్స్ పెరగడం అంటే సమీప భవిష్యత్తులో మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతుందని అర్థం. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనను ఇది స్పష్టంగా చూపుతోంది.
5. అమెరికా ఫెడ్ కఠిన వైఖరి:
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ.. భవిష్యత్తులో రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలిచ్చింది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గకపోతే, విదేశీ పెట్టుబడిదారులకు భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్ల కంటే అమెరికా బాండ్లే ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
6. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ క్రాష్:
భారత మార్కెట్లలో అత్యంత కీలకమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 9 శాతం మేర కుప్పకూలడం మార్కెట్‌ను భారీగా దెబ్బతీసింది. గత రెండేళ్లలో ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. బ్యాంక్ చైర్మన్ అటాను చక్రవర్తి రాజీనామా చేయడంతో బ్యాంక్ మేనేజ్‌మెంట్‌పై ఇన్వెస్టర్లలో అనుమానాలు తలెత్తాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ సూచీని 3 శాతం మేర కిందకు లాగేసింది.
