భూమిపై దేవుడి ప్రతిరూపాలుగా భావించే చిన్న పిల్లలను, అమాయక ప్రజలను దేవుడి పేరుతో అత్యంత క్రూరంగా బలిగొన్న మతగురువు ఉదంతం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డలను "ప్రభువును కలుసుకుంటారంటూ" నమ్మించి, పబ్లిక్‌గా హింసించి కడతేర్చిన రాక్షస కాండకు కెన్యా కోర్టు చట్టపరమైన ముగింపు పలికింది. మత పిచ్చికి పరాకాష్టగా నిలిచిన ఈ దారుణ ఘటనలో పాల్ మెకెన్సీ అనే పాస్టర్‌తో సహా 28 మందిని దోషులుగా కెన్యా కోర్టు నిర్ధారించింది.
ఈ కేసులో కెన్యాలోని మొంబాసా హైకోర్టు సంచలన తీర్పు వెలువరిస్తూ.. షాకాహోలా అడవిలో జరిగిన 191 మంది హత్యలకు ఈ 29 మందే కారణమని ప్రాసిక్యూషన్ నిరూపించిందని స్పష్టం చేసింది. మృతుల్లో ఏకంగా 190 మంది చిన్న పిల్లలు ఉండటం ఈ కేసులోని అమానుషత్వాన్ని కళ్లకు కడుతోంది. భగవంతుడి పేరుతో సాగిన ఈ మారణహోమంలో దోషులకు నవంబర్ 6న శిక్ష ఖరారు చేయనున్నారు.
'గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్' ముసుగులో పాల్ మెకెన్సీ సాగించిన ఈ నరమేధం వెనుక పక్కా ప్లాన్ ఉంది. బయటి ప్రపంచం పూర్తిగా పాపభూయిష్టమైపోయిందని, అడవిలోనే మోక్షం లభిస్తుందని నమ్మించి అమాయకులను తన 800 ఎకరాల స్థలానికి రప్పించాడు. ఆ తర్వాత అక్కడ ఒక క్రమపద్ధతిలో మరణ శాసనాన్ని అమలు చేశాడు. ముందుగా చిన్న పిల్లలను, ఆ తర్వాత టీనేజర్లు, మహిళలు, పురుషులు ఇలా వరుసక్రమంలో అందరినీ ఉపవాసం ఉండాలని బలవంతంగా హుకుం జారీచేశాడు. తిండి పెట్టకుండా చిన్న పిల్లలను హింసించి, ఆకలితో అలమటించేలా చేసి పొట్టనబెట్టుకున్నాడు. ఎవరైనా తిండి కోసం ప్రయత్నిస్తే దారుణంగా శిక్షించేవారు.
పోస్టుమార్టం నివేదికలు మరింత భయానక నిజాలను బయటపెట్టాయి. కేవలం ఆకలితోనే కాకుండా, ఊపిరి ఆడకుండా చేయడం, మెడపై తీవ్ర ఒత్తిడి తెవడం, తలపై బలమైన గాయాలు చేయడం ద్వారా కూడా హత్యలు చేసినట్లు తేలింది. 2023 ఏప్రిల్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చినప్పుడు.. అడవిలోని సామూహిక సమాధుల నుంచి పోలీసులు 429 శవాలను వెలికితీశారు. మోసం, మత ఉన్మాదం ఏ స్థాయిలో మానవత్వాన్ని చంపేస్తాయో ఈ ఘటనే నిదర్శనం. 7 ఏళ్ల చిన్నారుల నుంచి 10 ఏళ్ల లోపు చిన్నారుల వరకు దేవుడి పేరుతో బలైపోవడం యావత్ మానవజాతి తలదించుకునేలా చేసింది.
ALSO READ : గొడవలతో సిటీ తగలబడిపోతే మాకేంటి..?
ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు బాధితుల కుటుంబాలకు కొంత ఊరటనిచ్చినప్పటికీ.. కోల్పోయిన తమవారి ప్రాణాలను మాత్రం తిరిగి రాదని రోధిస్తున్నారు. అమాయక ప్రజల నమ్మకాలను క్యాష్ చేసుకుంటూ.. మతం ముసుగులో నేరాలకు పాల్పడుతున్న ఇలాంటి గురువులకు ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరికగా నిలవనుంది. ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలు ఏ స్థాయికి దిగజారిపోతాయో షాకాహోలా ఘటన మానవచరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.
