ట్యాంకర్ల నీళ్లు పక్కదారి పట్టకుండా ఫిల్లింగ్ మార్కులు.. కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ పరిశీలన

ట్యాంకర్ల నీళ్లు  పక్కదారి పట్టకుండా ఫిల్లింగ్ మార్కులు.. కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ పరిశీలన
  • వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి  

హైదరాబాద్ సిటీ, వెలుగు : తాగునీటిపై ఒత్తిడి తగ్గించేందుకు జలమండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా శుద్ధి చేసిన నీటిని ఇతర అవసరాలకు  వినియోగించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గురువారం కోకాపేటలోని గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను జలమండలి ఎండీ కె అశోక్ రెడ్డి సందర్శించారు. ఫిల్లింగ్ స్టేషన్‌లోని నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌ను పరిశీలించారు. పీసీబీతో కలిసి పనిచేస్తూ వాటర్ క్వాలిటీ  టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. 

శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణాలు, పరిశ్రమలు, రోడ్ల శుభ్రత,  పార్కులు, ఉద్యానవనాల నిర్వహణ వంటి పనులకు వినియోగించాలని సూచించారు. అలాగే ట్యాంకర్లలో నీటిని నింపే సమయంలో వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,  ప్రతి ట్యాంకర్‌లో ఎంత నీరు నింపారనే వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఫిల్లింగ్ మార్కులు పెట్టాలన్నారు.