- కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం: కేటీఆర్
- గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధం కావాలని టీబీజీకేఎస్‌కు పిలుపు
- నియోజకవర్గాలవారీగా ప్రత్యేక ఇన్చార్జిల నియామకం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ సంస్థను ప్రైవేటీకరణ, అవినీతి కోరల నుంచి కాపాడుకోవడంతోపాటు బొగ్గు గని కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సంస్థను బలహీనపరిచేలా, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ఏ ప్రయత్నాన్నైనా గట్టిగా తిప్పికొడతామని హెచ్చరించారు. గోదావరిఖనిలో ఇటీవల నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సభ, తదుపరి కార్యాచరణపై గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి భారీగా పడిపోతోందని, టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై ఉమ్మడి పోరు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గనుల వేలం, ప్రైవేటీకరణ ఎత్తుగడలతో సింగరేణిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమవుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిపై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. సింగరేణి ఆస్తులు, ఉనికిని కాపాడుకోవడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమన్నారు. సంస్థపై దాడి చేసే నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మికులతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీబీజీకేఎస్ శ్రేణులు ఇప్పటినుంచే సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ ఇన్చార్జిలు..
రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్జిలను నియమించింది. తెలంగాణ భవన్లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిల పేర్లను కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆరు జిల్లాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సీనియర్ నేతలను ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.
