హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ మీటింగ్ వచ్చే నెల 5 కు వాయిదా పడింది. శుక్రవారం కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశం జరిగింది. ఇందులో సభ్యులు మధుసూదన్ రెడ్డి (కాంగ్రెస్ ), వేముల ప్రశాంత్ రెడ్డి (బీఆర్ఎస్), రాకేశ్ రెడ్డి(బీజేపీ), కూనంనేని సాంబశివ రావు (సీపీఐ) పాల్గొన్నారు.
మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన 45 నిమిషాల నిడివి గల వీడియో ఫుటేజీని వచ్చే నెల 5 న జరిగే కమిటీ సమావేశంలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
కాగా, కౌశిక్ రెడ్డి తరపున ఆయన వాదనను వినిపించేందుకు అడ్వకేట్ ను నియమించుకునే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యుడు కోరగా.. అందుకు కమిటీ అంగీకరించలేదు. అవసరమైతే కమిటీ ముందుకు కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డిని పిలిపించి నేరుగా వారిద్దరి వాదనలను వినాలనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది.
